Minister errabelli: బహిర్భూమి రహిత ఆవాసాల్లో తెలంగాణ రాష్ట్రం ఔత్సాహిక మోడల్‌గా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2021 డిసెంబర్ 31 వరకు బహిర్భామి రహిత ఆవాసాల సంఖ్య విషయంలో తెలంగాణ... ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉంది. రాష్ట్రంలోని 96.74 శాతం ఆవాసాలు బహిర్భూమి రహితాలుగా గుర్తింపు పొందినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. 35శాతంతో తమిళనాడు, 19 శాతంలో కేరళ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని 5,82,903 ఆవాసాలకు గాను కేవలం 26,138 ఆవాసాలు మాత్రమే బహిర్భూమి రహితాలుగా ఉన్నాయి. అందులో సగానికి మించి 13,737 ఆవాసాలు తెలంగాణవే కావడం విశేషం. సీఎం కేసీఆర్ పటిష్ఠమైన నాయకత్వ పరిపాలనలో సాధిస్తున్న అద్భుత ప్రగతికి ఇది నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్ర గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి వంటి పథకాల వల్లే మన పల్లెలు ఆదర్శంగా మారాయని మంత్రి అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపడుతూనే... నిరంతరం పారిశుద్ధ్య పనులు చేయడం వల్లే ఇలాంటి ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయని ఎర్రబెల్లి తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగస్వాములైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలకు దయాకర్ రావు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.