బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ మొత్తమే అప్పులు చేశామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. రుణాలు తీసుకోవడం విపరీతమైన పొరపాటు కాదని వ్యాఖ్యానించారు. పేద, మధ్య తరగతి వారిని ఆదుకునేందుకు అప్పు ఎక్కువ చేసినా ఫర్వాలేదని.. కానీ ఆ వర్గాలను ఆదుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం ఆలోచించిందని స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో పథకాలను ఎత్తివేసినప్పటికీ... ఇక్కడ మాత్రం అలాగే నడిపిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ఒక్క ఏపీనే కాదు.. దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అప్పుల్లో ఉందని వివరించారు.
చర్చకు సిద్ధం...
కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మండిపడ్డారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వందేళ్ల నుంచి తమ కుటుంబం మైనింగ్ రంగంలో ఉందన్న ఆయన... తానిప్పటికీ పాత కారే వాడుతున్నానని చెప్పారు.