RAIN ALERT: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలతోపాటు దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలతో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న ప్రకటించారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6కి.మీ ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉందని తెలిపారు. ఇది వచ్చే 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని పేర్కొన్నారు. అదే విధంగా రుతుపవనాల ద్రోణి సముద్రమట్టం వద్ద జైసల్మేర్ నుంచి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత తీరంతోపాటు.. ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు , రేపు భారీ నుంచి అతి భారీ.. అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్లు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అదే విధంగా రాగల రెండు రోజులు గంటకు 30నుంచి 40కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతాయని వివరించారు.