కలకలం రేపుతున్న ఎల్ అండ్ టీ రాసిన లేఖ - మేడిగడ్డ పునరుద్ధరణకు అయ్యే వ్యయం ప్రభుత్వమే భరించాలి Medigadda Barrage Damage Issue : మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఇందుకు అయ్యే మొత్తాన్ని చెల్లించేలా అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని పేర్కొంది.బ్యారేజీ కుంగినపుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయడం, దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్ ఇన్ చీఫ్ కింది స్థాయి ఇంజినీర్లకు దానిని పంపడం చర్చనీయాంశంగా మారింది.
నివేదికలు చూడకుండానే మాపై నిందలా? జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌కు రాష్ట్రప్రభుత్వం లేఖ
Ground Report on Medigadda Barrage Issue : బ్యారేజీ కుంగిన చోట పియర్స్, పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆ నిర్మాణానికి రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్ అండ్ టీ ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. ఈ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్‌ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు.
దెబ్బతిన్న బ్లాక్‌ను, పియర్స్‌ను పునరుద్ధరించడానికి సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు కావొచ్చని నీటి పారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వచ్చింది. నీటిని పూర్తిగా మళ్లించి ఏం నష్టం జరిగిందో, పునరుద్ధరణ పని ఏం చేయాలో స్పష్టంగా తేలితేనే మొత్తం ఖర్చుపై ఓ అంచనాకు రావడానికి వీలవుతుంది. అక్టోబరు 22న నిర్మాణ సంస్థ, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జారీ చేసిన ప్రకటనకు పూర్తి భిన్నంగా తాజా లేఖ ఉంది. మేడిగడ్డ పునరుద్ధరణకు అయ్యే వ్యయం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ తాజాగా రాసిన లేఖ స్పష్టం చేస్తోంది.
మేడిగడ్డ బ్యారేజీ ఘటన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
Kaleshwaram Project Issues: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఏడో బ్లాక్ అక్టోబరు 21న కుంగింది. మరుసటి రోజు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సహా సంబంధిత ఇంజినీర్లు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని, పునరుద్ధరణ పని పూర్తిగా నిర్మాణ సంస్థే చేపడుతుందని బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు పేరుతో ప్రకటన విడుదలైంది. బ్యారేజీ డిజైన్ పూర్తిగా రాష్ట్ర అధికారులదని, పునరుద్ధరణ పనిని తాము సొంతంగానే చేపడతామని నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ కూడా అదే రోజు ఓ ప్రకటన విడుదల చేశారు.
బ్యారేజీని పరిశీలించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డ్యాం సేఫ్టీ నిపుణుల బృందాన్ని పంపింది. అనిల్ జైన్ నాయకత్వంలోని ఈ బృందం బ్యారేజీని పరిశీలించి పియర్స్ కుంగినట్లు పేర్కొంది. ఇందుకు గల కారణాలను విశ్లేషించింది. ఈ బృందం హైదరాబాద్‌లో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయినప్పుడు కూడా బ్యారేజీ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని ఇంజినీర్లు తెలిపారు. కుంగిన ఏడో బ్లాక్ ప్రాంతానికి నీటి ప్రవాహం లేకుండా చేసేందుకు కాఫర్ డ్యాం నిర్మాణం చేసే ప్రయత్నంలో ఉండగా, తాజాగా నిర్మాణ సంస్థ రాసిన లేఖ కలకలం రేపుతోంది.
Medigadda Barrage Issue Update: పని పూర్తయినట్లు సంబంధిత ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొన్నా 2021 మార్చి 15 నుంచి 2023 మార్చి 15 వరకే గుత్తేదారు నిర్వహణ బాధ్యత ఉండాలి. అలాంటిది 2023 అక్టోబరు 21న బ్యారేజీకి నష్టం వాటిల్లితే పునరుద్ధరణ బాధ్యత గుత్తేదారుదే అని నీటి పారుదల శాఖ ఎందుకు చెప్పింది? తామే చేస్తామని గుత్తేదారు సంస్థ ఎందుకు అధికారికంగా ప్రకటించిందన్నది చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
మేడిగడ్డపై అధికారుల దృష్టి, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు!
'బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం- అందుకే కాళేశ్వరం ఘటనపై కేంద్రం మౌనం'