పోలవరం ప్రాజెక్టులో చేపట్టబోయే అదనపు పనులకు ఏపీ జలవనరులశాఖ అధికారులు ఏప్రిల్‌లో పిలిచిన టెండర్లకు స్పందన కరవైంది. కేవలం ఇద్దరు గుత్తేదారులే పాల్గొనగా.. వారు సమర్పించిన బిడ్లు కూడా డాక్యుమెంటేషన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో ఆ టెండరు రద్దు చేసి రెండోసారి టెండర్లు ఆహ్వానించారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాంలో కొత్తగా అదనపు పనులు చేపట్టవలసి వచ్చింది. స్పిల్ వే తర్వాత నది నీళ్లు ప్రవహించే స్పిల్ ఛానల్ వద్ద చివర్లో దాదాపు 1,354 మీటర్ల పొడవునా కటాఫ్ డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. మరోవైపు ప్రధానంగా రాతిమట్టి కట్ట మూడు భాగాలుగా ఉంది. ఇందులో మూడో భాగంలో 140 మీటర్ల పొడవునా కాంక్రీటు డ్యాం నిర్మాణానికి నిర్ణయించారు. రెండో భాగంలో కొంత మేర డీప్ సాయిల్ మిక్సింగ్, ఇతర పనులు చేయాలి. మొదటి భాగంలోనూ 586 మీటర్ల పొడవునా సాయిల్ మిక్సింగ్ పనులు చేయాల్సి ఉంది. స్పిల్ ఛానల్‌లో కుడి వైపున ఉన్న కొండవాలు రక్షణ పనులు చేస్తున్నారు. వీటన్నింటికీ కలిపి రూ.683 కోట్ల అంచనాతో ఎల్‌ఎస్ పద్ధతిలో టెండర్లు పిలిచారు.