రెండో దశలో మరో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగాలన్నారు. పూర్తైన 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించే వరకు భద్రత కల్పించాలని సూచించారు. తొమ్మిది నెలల్లోగా మిగిలిన ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రతి వాహనానికి ప్రత్యేక గుర్తింపు
గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు, వ్యర్థాలను రోడ్లు, చెరువుల్లో వేసేవారిపై కఠినంగా వ్యవహరించి జరిమానా విధించాలని మేయర్ నిర్ణయించారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలు జీహెచ్ఎంసీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహనానికి వ్యర్థాలు వేయడానికి స్థలంతో పాటు ప్రత్యేక గుర్తింపు జారీ చేస్తామని తెలిపారు.