Marri Rajashekar on IT Raids: ఐటీ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని సోదాల పేరిట వేధింపులకు గురిచేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఐటీ అధికారులు.. దిల్లీ పెద్దలకు గులాంగిరీ చేస్తూ అమానుషంగా ప్రవర్తించారంటూ మర్రి రాజశేఖర్ విమర్శించారు. టర్కీకి వెళ్లిన రాజశేఖర్‌రెడ్డి.. ఐటీ దాడుల నేపథ్యంలో హుటాహుటిన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని ఇంటికి వచ్చారు.
తన కూతురిని బ్యాంకు లాకర్లను తెరిచేందుకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. సోదాల పేరుతో తన తల్లిదండ్రులను వేధించారని ఆరోపించారు. తన ఇంట్లో రూ.4 కోట్ల నగదు సీజ్ చేసినట్లు తెలిసిందన్నారు. గతంలో కూడా ఐటీ దాడులు జరిగినప్పటికీ ఈసారి కుట్రపూరితంగా వేధింపులకు గురిచేస్తూ.. ఐటీ అధికారులు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పని చేశారని వ్యాఖ్యానించారు. ఐటీ, జీఎస్‌టీ చెల్లింపులన్నీ పారదర్శకంగానే ఉన్నాయని తెలిపారు. ఐటీ విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు.