తెలంగాణ

telangana

ETV Bharat / state

గొర్రెల సంఖ్యలో తెలంగాణ అగ్రస్థానం - many sheep in telangana

దేశవ్యాప్తంగా తెలంగాణలో అత్యధిక గొర్రెలున్నాయి. జాతీయ సగటు తలసరి మాంసం వినియోగం, వృద్ధిరేటులోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ పశుగణన తాజా నివేదికలో వెల్లడించింది. గొర్రె మాంసం, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్​, మేక మాంసం ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచాయి.

many sheep in telangana
గొర్రెల సంఖ్యలో తెలంగాణ అగ్రస్థానం

By

Published : May 31, 2020, 7:24 AM IST

దేశవ్యాప్తంగా అత్యధిక గొర్రెలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. జాతీయ సగటు తలసరి మాంసం వినియోగంలోనూ, మాంసం వృద్ధిరేటులోనూ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పశుగణాంకాల వివరాల నివేదికను కేంద్ర పశుసంవర్ధకశాఖ తాజాగా వెల్లడించింది. దేశంలో ప్రతి ఐదేళ్లకోసారి మొత్తం పశు, జీవాల గణాంకాలను ఈ శాఖ సేకరిస్తుంది. తొలుత ఇలా 1919లో సేకరించగా 20వ సారి 2019లో సేకరించారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ శనివారం ఈ వివరాలను వెల్లడించింది. గొర్రె మాంసం, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌, మేక మాంసం ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో నిలిచాయి. కోడిగుడ్లు ఉత్పత్తి, తలసరి లభ్యతలో తెలంగాణ, ఏపీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో తలసరి ఏడాదికి 372 కోడిగుడ్లు అందుబాటులో ఉన్నాయనే లెక్కలను ఈ రెండు రాష్ట్రాలు సంయుక్తంగా ఇచ్చాయి. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు...

  • దేశవ్యాప్తంగా జాతీయ సగటు తలసరి మాంసం వినియోగం ఏటా 5.4 కిలోలుంటే తెలంగాణలో 9.2 కిలోలుంది. ఈ 9.2 కిలోల్లో 4 కిలోలు గొర్రెలు, మేకల మాంసమే.
  • దేశంలో ఏటా 5.08 కోట్ల గొర్రెలను మాంసం కోసం వధిస్తుండగా గతేడాది వాటిలో 2.08 కోట్లు తెలంగాణలోనే ఉన్నాయి.
  • మాంసం వార్షిక వృద్ధి రేటు తెలంగాణలో అత్యధికంగా 16.9 శాతం ఉంది.
  • పాల ఉత్పత్తి వృద్ధి రేటులో కర్ణాటక, గుడ్లు ఉత్పత్తి వృద్ధి రేటులో రాజస్థాన్‌, ఉన్ని ఉత్పత్తిలో బిహార్‌ ముందున్నాయి.
  • పశు ఉత్పత్తుల విలువలో పాలు, పాల ఉత్పత్తులపై వచ్చే ఆదాయమే అత్యధికంగా 65.05 శాతముంది. మాంసం విలువ 19.83 శాతం.
  • మార్కెట్‌లో విక్రయించే కోడిగుడ్లులో 82.20 శాతం బ్రాయిలర్‌ కోళ్లవే. మిగతావి నాటుకోడి గుడ్లు.
  • దేశంలో విక్రయిస్తున్న మొత్తం మాంసంలో సగం (50.06) శాతం కోళ్లది కాగా గేదెలు, దున్నలది 19.05, మేకలది 13.35, గొర్రెలది 8.36, పందులది 4.98 శాతముంది.
  • దేశంలో ఏటా 40.60 లక్షల టన్నుల కోడిమాంసాన్ని తింటున్నారు.
  • 2017-18లో విదేశాల నుంచి పశువులు, పశు ఉత్పత్తుల దిగుమతుల విలువ 10,124 కోట్లు కాగా ఎగుమతుల విలువ రూ.45,776 కోట్లు.
  • దేశంలో మొత్తం కోటీ 37 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి.
  • తలసరి 9 కిలోల చేపలు లభిస్తున్నాయి.
  • ఏటా చేపల ఎగుమతులపై రూ.45,106 కోట్ల ఆదాయం వస్తోంది.
  • మత్స్యరంగంలో ఉపాధి పొందుతున్నవారు 1.45 కోట్లు.
  • పశుగ్రాసాన్ని 91.30లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు.
  • పశువుల మేతకు కోటీ 2 లక్షల హెక్టార్ల మైదానాలున్నాయి.
  • దేశజనాభాలో ప్రతి వెయ్యి మందికి గ్రామాల్లో 10.2, పట్టణాల్లో 5.5 శాతం మంది పురుషులు పశువుల పెంపకంలో పనిచేస్తున్నారు.
  • మహిళలు గ్రామాల్లో 88.3, పట్టణాల్లో 25.6 శాతం మంది పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో పెరిగిన ఆదాయం...

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం అమలుతో వాటి సంఖ్యలో దేశంలో అగ్రస్థానానికి చేరడమే కాకుండా రూ.4877.01 కోట్ల సంపదను సృష్టించినట్లు పశుసంవర్ధకశాఖ సంచాలకుడు డాక్టర్‌ లక్ష్మారెడ్డి చెప్పారు. మొత్తం రూ.4579 కోట్లు ఖర్చు చేసి 76.94 లక్షల గొర్రెలను పంపిణీ చేయగా వీటికి మరో కోటీ 8 లక్షల పిల్లలు పుట్టాయని వివరించారు. వీటి నుంచి 75,865 టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుందన్నారు.

గొర్రెల పంపిణీ పథకం అమలుకు ముందు రాష్ట్రంలో 2015-16లో 1.35 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తవగా 2019-20లో 2.77 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లు ఆయన చెప్పారు. ఏకంగా 105 శాతం పెరుగుదల కూడా ఓ రికార్డు అని తెలిపారు.

పశుగణన నివేదిక పూర్తి వివరాలు

దేశంలో మాంసం కోసం వధిస్తున్న పశువుల సంఖ్య (లక్షల్లో)
పశువులు సంఖ్య
ఆవులు, ఎద్దులు 30.50
గేదెలు, దున్నలు 119
గొర్రెలు 508
మేకలు 972
పందులు 107
కోళ్లు 200.81 కోట్లు
పశు గణాంకాల్లో ఏ రాష్ట్రం ఎందులో అగ్రస్థానం?
అంశం రాష్ట్రం
గొర్రెల సంఖ్య తెలంగాణ
చేపల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌
గొర్రె మాంసం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌
అత్యధికంగా కోడిగుడ్ల ఉత్పత్తి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌
తలసరి కోడిగుడ్ల లభ్యత తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌
అత్యధికంగా కోడిమాంసం హరియాణా
కోళ్లు అత్యధికం తమిళనాడు
పాల ఉత్పత్తి ఉత్తర్‌ప్రదేశ్‌
దేశీయ ఆవులు అత్యధికం ఉత్తర్‌ప్రదేశ్‌
సంకరజాతి ఆవులు తమిళనాడు
పాడి పశువులు అత్యధికం పశ్చిమబెంగాల్‌
గేదెలు ఉత్తర్‌ప్రదేశ్‌
మేకలు రాజస్థాన్‌
పందులు అసోం
ఒంటెలు రాజస్థాన్‌
గుర్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌
గాడిదలు రాజస్థాన్‌

మరికొన్ని విశేషాలు...

దేశంలో పశుగణాంకాలు (కోట్లలో)
మొత్తం పశువులు 53.67
కోళ్లు 85.18
పాడి పశువులు 12.57
గేదెలు 10.98
ఆవులు 19.34
గొర్రెలు 7.42
మేకలు 14.88
పందులు 0.90
ఒంటెలు 0.02
గుర్రాలు 0.34
గాడిదలు 0.12
కుక్కలు 2.47
బాతులు 3.35
దేశ పశువైద్య రంగం తీరు
ఏవి? ఎన్ని
పశువైద్యశాలలు 37,647
పశు చికిత్సా కేంద్రాలు 28,168
కృత్రిమ గర్భధారణ కేంద్రాలు 7.57 కోట్లు

ఇదీ చదవండిఃకరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!

ABOUT THE AUTHOR

...view details