నర్సుల నియామక ప్రక్రియలో వెయిటేజీ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హతలేని అభ్యర్థులకు కొందరు అధికారులు అండగా నిలిచారంటూ ఫిర్యాదులు రావడంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ వైద్యంలో ఇప్పటికే ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులకు నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ మేరకు 3,848 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి 1,823 మందిని అర్హులుగా పరిగణించి, వారి అర్హత మేరకు వెయిటేజీ ఇచ్చారు. మిగిలిన 2,025 మంది దరఖాస్తులను తిరస్కరించారు. వైద్యఆరోగ్యశాఖ పంపించిన 1,823 మంది దరఖాస్తుల నుంచే నర్సుల భర్తీకి సంబంధించిన తాత్కాలిక జాబితాను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఆ జాబితాలో అర్హత లేని అభ్యర్థులకు వెయిటేజీ మార్కులు కలిపారనీ, పొరుగు సేవల్లో పనిచేసిన వారిని ఒప్పంద ప్రాతిపదికన పనిచేసినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి, వెయిటేజీ ఇచ్చారనే తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. దీనిపై 100కు పైగా ఫిర్యాదులు రావడంతో వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ సమగ్ర విచారణకు ఆదేశించారు.
నర్సుల ‘వెయిటేజీ’లో గోల్‌మాల్.. నిలిచిన భర్తీ ప్రక్రియ
నర్సుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. వెయిటేజీ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడం వల్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని రాష్ట్ర ఆరోగ్య వైద్య కార్యదర్శి రిజ్వీ తెలిపారు.
సత్వరమే నివేదిక అందించాలని ప్రజారోగ్య సంచాలకులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇప్పుడు ఆ ఆరోపణలు వచ్చిన అభ్యర్థుల వెయిటేజీ సరైందా? కాదా? వీరు కాకుండా ఇతరుల వెయిటేజీల్లోనూ ఏమైనా అవకతవకలున్నాయా? ఒకవేళ ఉద్దేశపూర్వకంగా తప్పు జరిగితే.. అది ఏ స్థాయిలో జరిగింది? అనే పలు అంశాలపై స్పష్టత తీసుకురావడానికి మొత్తం అభ్యర్థుల దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఏ ఆసుపత్రిలో పనిచేశామని దరఖాస్తులో పొందుపర్చారో.. ఆ ఆసుపత్రి నుంచి మరోసారి సమాచారాన్ని తెప్పించుకొని, సంబంధిత అధికారి ధ్రువీకరించిన తర్వాతే.. మరోసారి పరిశీలన జరిపి.. తాజాగా వెయిటేజీని ఇవ్వాలని తీర్మానించింది. ఎవరి మీదైతే ఆరోపణలు వస్తున్నాయో.. ఆ అభ్యర్థిని, ధ్రువీకరించిన అధికారిని నేరుగా పిలిపించి, సరిచేసుకోవాలని ఆదేశాలిచ్చింది.
ఎవరికి అన్యాయం జరగదు
నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామని, ప్రతి ఒక్క దరఖాస్తును, వెయిటేజీని సమూలంగా పరిశీలించిన అనంతరమే భర్తీ ప్రక్రియ ముందుకెళ్తుందనీ, ఎవరికి అన్యాయం జరగదని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వెయిటేజీలో అవకతవకలున్నట్లుగా తేలితే బాధ్యులైపై చర్యలు తీసుకుంటామన్నారు.
ధ్రువపత్రాల పరిశీలన వాయిదా
నర్సుల నియామకాలకు సంబంధించి ఈ నెల 13 నుంచి 19 వరకూ నిర్వహించాల్సిన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. నర్సులభర్తీకి 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల తాత్కాలిక జాబితాను వెల్లడించగా అందులో వెయిటేజీ మార్కులపై అభ్యంతరాలు వచ్చినందున ఆ జాబితాను తిరిగి పరిశీలించాలని కోరుతూ ఆరోగ్య శాఖకు పంపించామంది.