సైబర్ నేరగాడి వలలో పడి హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన ఓ మహిళ సుమారు పది లక్షలు రూపాయలు మోసపోయింది. ఫేస్ బుక్లో పరిచయమైన యువకుడితో చాటింగ్... వాట్సప్ వరకూ వచ్చింది. తన పేరు జిమ్ జై అని సైబర్ నేరగాడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను సుమారు రెండు కోట్ల రూపాయల డబ్బుతో భారత్కు వస్తున్నట్లు బాధితురాలిని నమ్మించాడు. అనంతరం రెండు రోజులకే తనని దిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నట్లు నమ్మబలికాడు. సుమారు రూ.లక్షా 55 వేలు కడితే తనను విడిచిపెడతారని ఆమెకు సందేశం పంపాడు.
నమ్మించాడు... మోసం చేశాడు
తాను అడిగిన డబ్బు పంపిస్తే బయటకు వచ్చాక అధిక సొమ్ము ఇస్తానని ఆశ చూపాడు. అతన్ని నమ్మిన సదరు మహిళ దుండగుడు ఇచ్చిన ఖాతాకు డబ్బు బదిలీ చేసింది. ఆ తర్వాత ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ అంటూ జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపుగా 9.55 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆపై ఎంతకీ నిందితుడి నుంచి స్పందన లేకపోవడం వల్ల తాను మోసపోయానని బాధిత మహిళ గ్రహించింది. తనను మోసం చేసి డబ్బులు గుంజిన నేరగాడిని పట్టుకుని..తగిన న్యాయం చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : లాక్డౌన్ సమయంలో ఇల్లు గుల్ల చేసిన దొంగలు