రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లాటరీ(telangana liquor tender 2021) నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక చేస్తున్నారు. మేడ్చల్ కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్‌లో హాల్‌లో డ్రా తీశారు. 114 దుకాణాలకు 3,600 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. వరంగల్, హనుమకొండ, మంచిర్యాలలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. 122 దుకాణాలకు డ్రా తీస్తున్నారు. దరఖాస్తు దారులు వేలాది మంది తరలి రావటంతో జనాలతో నిండిపోయింది. మద్యం దుకాణాల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష మహిళా సంఘాల నాయకులు అందోళన నిర్వహించారు. డ్రా తీసే ప్రాంగణం లోపలికి చోచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో లక్కీ డ్రా నిర్వహించిన కలెక్టర్లు... ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని వెల్లడించారు.
మేడ్చల్‌లో డ్రా..
మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్‌లోని 3 పీఎస్ పరిధిలో 114 మద్యం దుకాణాలకు 3,609 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. నేడు లబ్ధిదారుల ఎంపికలో(telangana liquor tender 2021) భాగంగా కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్ హాల్‌లో లాటరీ ద్వారా జిల్లా కలెక్టర్ హరీష్ ఆధ్వర్యంలో డ్రా తీస్తున్నారు. ఈ ప్రక్రియకు 3,609 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. దుకాణాల వారీగా డ్రా తీస్తుండగా ముందుగా ఆ దుకాణానికి సంబంధించిన దరఖాస్తుదారులను పిలిచి.. వారి సమక్షంలో సీరియల్ నంబర్ ఆధారంగా టోకెన్లను డబ్బాలో వేసి.. డ్రా తీశారు.
మహిళా సంఘాల ఆందోళన
ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్‌లో ఖమ్మం జిల్లా మద్యం దుకాణాల డ్రా(telangana liquor tender 2021) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 122 దుకాణాలకు డ్రా తీస్తున్నారు. మొత్తం సుమారు 6000 దరఖాస్తులు రాగా... వాటిని దుకాణాల వారీగా డ్రా నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారులు వేలాదిమందిగా తరలిరావటంతో సీక్వెల్ రిసార్ట్స్ ప్రాంతం జనాలతో నిండిపోయింది. అనుమతి పత్రాలు చూసి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణువారియర్ ప్రారంభించారు. కలెక్టర్ డ్రా తీసి దుకాణాలను కేటాయిస్తున్నారు. మరోవైపు మద్యం దుకాణాల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష మహిళా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. డ్రా తీసే ప్రాంగణం లోపలికి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డ్రా రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రా ప్రక్రియ సజావుగా సాగింది.