వ్యవసాయ చట్టాలు రద్దు, విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన భారత్ బంద్‌లో భాగంగా అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో వామపక్షాల నేతలు కె.నారాయణ, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పాక్షికంగా బంద్ - తెలంగాణ తాజా వార్తలు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా... అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ పాక్షికంగా జరిగింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ధర్నాలు, ప్రదర్శనలు, నిరసనలు చేశారు.
కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. సాగు చట్డాలు రద్దు చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని వామపక్షాల నేతలు ఆక్షేపించారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న మోదీ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని నేతలు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయంలో సీఎం కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంల్ఎల్) న్యూడెమోక్రసీ, తెదేపా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతినిధులు, శ్రేణులు కదం తొక్కుతూ ముందు సాగాయి.
ఇదీ చూడండి:'రాష్ట్రంపై సూర్యుడి సెగ.. రానున్న 3 రోజులు భగభగలే..'