హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యుత్ అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ, సీపీఎం నాయకులు నివాళులు అర్పించారు. ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన విద్యుత్ ఉద్యమం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు హెచ్చరిక అని వామపక్ష నేతలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన విద్యుత్ అమర వీరులను వామపక్ష పార్టీ నాయకులు స్మరించుకున్నారు.
కాల్పుల ఘటనకు 20ఏళ్లు
2000 సంవత్సరం ఆగస్టు 28న పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీకి వెళ్తున్న ప్రజలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఈ ఘటనలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ప్రాణాలు కోల్పోయారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు నేటితో ఇరవై ఏళ్లు పూర్తయ్యింది.