తెంలగాణలో కరోనా విజృభిస్తోంది. సోమవారం 61 కేసులు నమోదుకాగా.. మంగళవారం 52 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 644కు చేరింది. నిన్న ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. చనిపోయిన వారి సంఖ్య 18కి చేరింది. ప్రస్తుతం 516 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏడుగురు డిశ్చార్జ్
మంగళవారం ఏడుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 110కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ నుంచి 36 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాల వారిగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 249, నిజామాబాద్ జిల్లా 36, వికారాబాద్ జిల్లాలో 29 యాక్టివ్ కేసులున్నాయి. సూర్యాపేట జిల్లా 23, మేడ్చల్ జిల్లాలో 22, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 21 మంది చొప్పున, జోగులాంబ జిల్లాలో 18, నిర్మల్ జిల్లాలో 17 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జనగామలో సున్నాకు చేరిన యాక్టివ్ కేసులు
నల్గొండ జిల్లాలో 12, ఆదిలాబాద్ జిల్లా 11, మహబూబ్నగర్ జిల్లాలో 10 యాక్టివ్ కేసులున్నాయి. కామారెడ్డి జిల్లాలో 8, ఖమ్మం జిల్లా 7, సంగారెడ్డి జిల్లా 6, మెదక్, భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడేసి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు, జగిత్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాలో రెండేసి చొప్పున కరోనా సోకిన వారు చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కో కేసు ఉండగా.. గతంలో రెండు పాజిటివ్ కేసులు ఉన్న జనగామలో ఇప్పుడు యాక్టివ్ కేసులు సున్నాకు చేరాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కరోనా కేసులు
జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు కంటైన్మెంట్ పనులను వేగవంతం చేశారు. ఆయా ప్రాంతాల్లోని వివిధ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అవసరమైనవారికి కరోనా పరీక్షలు చేయించాలని.. ఆస్పత్రులకు తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:-'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'