తెలంగాణ

telangana

ETV Bharat / state

Rythu bandhu: భూ సమస్యలపై 88 వేల వినతులు

రైతుబంధు కోసం భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ఫిర్యాదుల స్వీకరణకు పెద్దఎత్తున దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమస్యల్లో దాదాపు ఇరవైశాతం వరకు పరిష్కరించినట్లు సమాచారం.

Rythu bandhu
Rythu bandhu

By

Published : Jun 11, 2021, 9:49 AM IST

మీసేవా, ధరణి పోర్టల్‌ ద్వారా నేరుగా జిల్లా కలెక్టర్లకు భూ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకునే అవకాశం కల్పించగా గురువారం వరకు దాదాపు 65 వేల దరఖాస్తులు అందాయి. దీంతోపాటు వారం కిందట వాట్సప్‌, మెయిల్‌ ద్వారా కూడా అవకాశం కల్పించడంతో 23 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ల ద్వారా తహసీల్దార్లకు పంపించి దస్త్రాలు పరిశీలన చేయిస్తున్నారు. అనంతరం కలెక్టర్లు యాజమాన్య హక్కులకు అనుమతి జారీచేస్తున్నారు. సరైన ఆధారాలు లేని రైతుల దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. రెండు రోజులుగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దీంతోపాటు రైతుబంధుకు అర్హుల జాబితాను సమర్పించేందుకు గురువారంతో గడువు ముగియడంతో కలెక్టరేట్లు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సిబ్బంది దస్త్రాలను తిరగేస్తూ తీరికలేకుండా ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కొందరు రైతులకు ఫిర్యాదు చేసే విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో సరైన ఆధారాలు సమర్పించకపోయినా, సర్వర్‌ పనిచేయకపోయినా ఫిర్యాదు తిరస్కారానికి గురవుతోంది. ఈ మేరకు రైతుల సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చినా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొన్నిచోట్ల సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్‌ కూడా అందని పరిస్థితి ఉంది. గురువారం నాటికి అందిన దరఖాస్తుల్లో అర్హులుగా గుర్తించిన వారిని మాత్రమే రైతుబంధు జాబితాకు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువు పొడిగించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details