తెలంగాణ

telangana

By

Published : Sep 11, 2020, 6:58 AM IST

ETV Bharat / state

అసైన్డ్‌ భూములు కబ్జాలో ఉన్నవారికే ఇచ్చే యోచన.!

రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్ట్​ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను నిర్దిష్ట ధరలకు క్రమబద్ధీకరిస్తున్నారు. భూ చట్టాల ప్రకారం నిర్దిష్టంగా కొన్నేళ్లు అధీనంలో ఉంటే యాజమాన్య హక్కులు వర్తించే అవకాశం ఉన్న వారికి కేటాయించాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.

land sorting in telangana
land sorting in telangana

అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధి లేని పేదలకు గతంలో ప్రభుత్వం అసైన్డ్‌ చట్టం కింద రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల చొప్పున భూములను కేటాయించింది. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాల వరకు పంపిణీ చేసినట్లు అంచనా. అనంతరం కొందరు పేదలు వాటిని విక్రయించుకోగా మరికొన్నిచోట్ల వాటిని వదిలి వెళ్లిపోయారు. పట్టణ, నగర ప్రాంతాల్లో ఇలా ఖాళీగా ఉన్న భూములు కబ్జాకు గురయ్యాయి. రాష్ట్రంలో ఇలాంటి భూములు దాదాపు 2.41 లక్షల ఎకరాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అనధికారికంగా మరికొన్ని ఉండొచ్చని అంచనా. అసైన్డ్‌ చట్టం కింద భూమిని పొందిన యజమాని మినహా మరెవ్వరికీ దానిపై అధికారం ఉండదు. విక్రయం, దానం, బహుమతి ఇవ్వడానికి కూడా వీలు ఉండదు. అయినప్పటికీ పెద్ద ఎత్తున భూములు చేతులు మారడంతో ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

చట్ట సవరణ తప్పదా?

అసైన్డ్‌ చట్టం ప్రకారం ఆ భూములను విక్రయించడానికి అవకాశం లేదు. అనర్హులెవరైనా ఆ భూమిలో ఉంటే ప్రభుత్వం దానిని వెనక్కు తీసుకుని తిరిగి పేదలకు ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఉంది. అయితే, చాలా జిల్లాల్లో చేతులు మారిన భూములు వెనక్కు తీసుకునే పరిస్థితులు లేవు. కొన్నిచోట్ల పదిమంది వరకు యజమానులు మారారు. చాలాచోట్ల నాటి వ్యవసాయ భూములు నివాస ప్రాంతాలుగా మారాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ భూములను ప్రస్తుతం కబ్జాలో ఉన్న వారికే కేటాయిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో రెవెన్యూశాఖ కసరత్తు చేస్తోంది. చట్టానికి సవరణ తీసుకొచ్చి.. భూ చట్టాల ప్రకారం నిర్దిష్టంగా కొన్నేళ్లు అధీనంలో ఉంటే యాజమాన్య హక్కులు వర్తించే అవకాశం ఉన్న వారికి కేటాయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

గతంలో ఇలా...

ప్రభుత్వం 2018లో అసైన్డ్‌ కమిటీలను రద్దు చేసి ఆ అధికారాలను కలెక్టర్లకు అప్పగించింది. అసైన్డ్‌ భూములు కబ్జా అయిన చోట యజమానులకు, ఆ భూమిలో ప్రస్తుతం ఉన్న వారికి నోటీసులు జారీ చేశారు. నిరుపేదలు ఉంటే వారికే ఆ భూమిని ఇచ్చేందుకు పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. పలు కారణాలతో అది అమలు కాలేదు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా పారదర్శకమైన భూ పరిపాలన నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా కొత్త విధానాలను తీసుకొస్తోంది. పనిలో పనిగా అసైన్డ్‌ ఆక్రమణలను కూడా పరిష్కరించాలని నిర్ణయించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

సవాళ్లతో కూడిన వ్యవహారం!

అసైన్డ్‌ భూముల పంపిణీ సమయంలో వ్యవసాయ భూములుగా, గ్రామీణంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాలుగా, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. కొన్ని జిల్లాల్లో రూ.కోట్ల ధర పలుకుతున్నాయి. అలాంటిచోట్ల అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయని రెవెన్యూశాఖ గుర్తించింది. చాలామంది చేతులు మారినవాటి స్వాధీనం కూడా సవాళ్లతో కూడుకున్నదని భావిస్తున్నారు. స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న చోట ఆ భూమిని వెనక్కు తీసుకోవడం కన్నా వారికే క్రమబద్ధీకరిస్తే మేలన్న అభిప్రాయం ఇప్పుడు రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. అందుకు అనుగుణంగా నిబంధనలు మార్చేందుకు కసరత్తు ప్రారంభమైనట్లు తెలిసింది.

ప్రభుత్వ ధరలకే యాజమాన్య హక్కులు

ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను నిర్దిష్ట ధరలకు క్రమబద్ధీకరిస్తున్నారు. నివాస స్థలాల క్రమబద్ధీకరణ కింద గతంలో జీవో నెం.58, 59లను అమలు చేశారు. అనంతరం ఒక అడుగు ముందుకేసి ఆక్రమణదారుల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని మార్కెట్‌ ధరకు విక్రయించేందుకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇవి ఇంకా అమలు కాలేదు. సరిగ్గా ఇదే తీరులో.. చేతులు మారిన అసైన్డ్‌ భూమిని ఇప్పుడు కబ్జాలో ఉన్నవారికే కేటాయించి యాజమాన్య హక్కులు కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ

ABOUT THE AUTHOR

...view details