భూ వివాదమే అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. బాచారం గ్రామ పరిధిలోని రాజా ఆనందరావుకు సంబంధించి సుమారు 413 ఎకరాల భూమి వ్యవహారం ఆది నుంచి వివాదాస్పదంగానే ఉందంటున్నారు. ఈ భూములను గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామస్థులు సాగు చేసుకుంటూ వచ్చారని.. నాటి ప్రభుత్వాల నుంచి వీటికి పాసు పుస్తకాలూ జారీ అయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
ఇది 'రియల్' స్టోరీ
అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెండు వర్గాలకు చెందిన నాయకుల అనుచరులు ‘రియల్’ దందాల్లో ఆరితేరారు. పాత రికార్డుల్లోకి వెళ్లి లొసుగులు వెతికి లిటిగేషన్లు సృష్టిస్తారు. వాటిని చూపి భూయజమానిని బెదిరిస్తారు. ఉన్న భూమి చేజారిపోతుందని భయపెడతారు. ఇలా నయానాభయానా వారి నుంచి ఆ భూములను చౌకగా కొనేస్తారు. తర్వాత వివిధ స్థాయిల్లో తమ పలుకుబడిని ఉపయోగించి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అనంతరం అధిక ధరలకు వాటిని విక్రయిస్తారు. ఇక్కడ వీరిని కాదని ఎవరూ తహసీల్దారు కార్యాలయ మెట్లు ఎక్కే సాహసం చేయరని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొందరు పెద్దలు తెరవెనుక ఉంటూ కౌలు దారులను తెరమీరదకు తెస్తూ భూ కొనుగోలు దారులను పుట్టిస్తూ.. అక్రమాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే 200 ఎకరాల భూమిని బడాబాబులు స్వాహా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.