తెలంగాణ

telangana

ETV Bharat / state

Land Kabza Issue: ఖరీదైన భూములపై కన్ను.. నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కబ్జారాయుళ్లు

హైదరాబాద్‌లో ఖరీదైన భూములపై అక్రమార్కులు కన్నేశారు. భూమి తమదేనని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. ఇతరులకు విక్రయించేందుకు యత్నించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఖరీదైన భూమిని కాజేసేందుకు ఓ వ్యక్తి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

land grabbing  in issue
సర్కారు భూమలపై అక్రమార్కుల కన్ను

By

Published : Aug 4, 2021, 5:06 AM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో భూమి విలువ కోట్లకు పెరగడంతో సర్కారు భూములపై అక్రమార్కులు కన్నేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న 9 ఎకరాల 17 గుంటల భూమి విక్రయించేందుకు 4 నెలల క్రితం ఓ ఉపాధ్యాయుడితో రాంచందర్‌రావు ఒప్పందం చేసుకున్నాడు. అందుకోసం 10కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ స్థలం ప్రభుత్వానిదని తెలుసుకున్న ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాంచందర్‌రావు సహా మరోముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటికివచ్చిన నిందితుడు మళ్లీ ఆ భూమిని విక్రయించేందుకు షేక్ పేట తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేశాడు. ఆ పత్రాలు చూపించి భూమి విక్రయించేందుకు యత్నించి మరోసారి పోలీసులకు చిక్కాడు.

గతంలో బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. బంజారాహిల్స్‌లో 1950లో 45 ఎకరాల్ని ముగ్గురికి అసైన్డ్‌భూముల కింద కేటాయించారు. అక్కడ గుట్టలు, రాళ్లు, గుంతలుండటంతో సాగుయోగ్యంగా లేదని 1960లో కలెక్టర్ రద్దు చేశారు. అప్పటికే ఆ భూమిని 3 హౌజింగ్ సొసైటీలు కొనుగోలు చేశాయి. కలెక్టర్ రద్దుచేయడంతో ఆ సొసైటీలు కోర్టును ఆశ్రయించాయి. 2005 ప్రభుత్వం శాసనసభకమిటీ నియమించడంతో క్రమబద్ధీకరణచేయాలని సూచించింది. 45 ఎకరాలకు ప్రస్తుతం 25 ఎకరాలే మిగిలింది. మూడు సొసైటీలకు సర్దుబాటు చేయడం కుదరకపోవడం వల్ల ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంది.

ఆ భూములపై అక్రమార్కుల కన్ను

ఆ భూమి విలువ కోట్లకు చేరడంతో ఆక్రమణదారుల కన్నుపడింది. బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 14లో 2 ఎకరాల భూమిని ఖలిద్ అనే వ్యక్తి తనదేనంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా రిజిస్ట్రేషన్ చేసేలా ఆదేశాలిచ్చింది. భూమిని క్రమబద్ధీకరించాలని రెవెన్యూఅధికారులను కోరడం సహా అందుకోసం 30లక్షలు లంచం ఇచ్చాడు. ఆ కేసులో షేక్‌పేట రెవెన్యూ కార్యాలయ ఆర్​ఐ నాగార్జునరెడ్డి, తహసీల్దార్ సుజాతను పోలీసులు అరెస్టుచేశారు. ఖాలీద్ నకిలీ పత్రాలు సృష్టించినట్లు తేల్చిన సీసీఎస్​ పోలీసులు అతన్ని అరెస్టుచేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్​ వేళ... ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను

ABOUT THE AUTHOR

...view details