Land Acquisition In Projects: ‘‘ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లు రావాలంటే సత్వరమే భూసేకరణ పూర్తి చేయాలి. అందుకు అవసరమైనన్ని నిధులు కావాలి. కోర్టు కేసులు తొలగిపోవాలి. అలా అయితేనే పెండింగ్ పనుల్లో వేగం పెరుగుతుంద’’ని ముఖ్య ఇంజినీర్లు పేర్కొన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో ప్రాధాన్య పనులు పూర్తి చేయడం, గడువులోగా నీళ్లు పారించడమే లక్ష్యం కావాలని సర్కారు చెప్పినట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లాలోని శ్రీరంగనాయక సాగర్ విశ్రాంతి గృహంలో రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ సీఈలతో తాజాగా కీలక సమావేశం నిర్వహించింది. ఈ ప్రత్యేక సమావేశం ద్వారా ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సత్వరమే ఫలితాలిచ్చే.. అధిక ఆయకట్టుకు నీళ్లిచ్చే వాటిపై ప్రధాన దృష్టిసారించాలని చెప్పినట్లు తెలిసింది. ఒక్కో సీఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పురోగతి, సమస్యలను తెలియజేయగా, పలువురు ఈఎన్‌సీలు తమ పరిధిలో ఇబ్బందులను విశ్లేషించారు. శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పలు కీలక సూచనలను చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సమావేశంలో చర్చించిన అంశాలు...
భూ సేకరణే కీలకం..:కాళేశ్వరం ఎత్తిపోతల్లో చేపట్టిన అదనపు టీఎంసీ పనుల్లో భూసేకరణ అంశం కీలకంగా ఉంది. జలాశయాలు పూర్తయినా ఆయకట్టుకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కూడా భూసేకరణే అడ్డంకిగా మారింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల్లోనూ దాదాపు 400 ఎకరాలు కావాలి. సీతారామ ప్రాజెక్టులోనూ ఇప్పటికీ రూ.220 కోట్ల వరకు బకాయిలున్నట్లు అంచనాలున్నాయి. చనాకా-కొరాటా కింద దాదాపు 1,720 ఎకరాలు అవసరం. సీతమ్మసాగర్, డిండి తదితర ప్రాజెక్టుల కింద కూడా భూ సేకరణకు నిధులు కావాల్సి ఉంది. దీనికితోడు కోర్టుల్లో ఉన్న వ్యాజ్యాలు కూడా ప్రతిబంధకంగా మారాయి.