లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఔషధాలు లభించక తీవ్రంగా సతమతమవుతున్నారు. వారంతా పేద, బడుగు వర్గాలకు చెందినవారే కావడం వల్ల ప్రతి నెలా వేలకు వేలు పెట్టి మందులు కొనుగోలుచేసే స్తోమత ఉండదు. కొందరు అప్పుచేసి ప్రైవేటులో మందులు కొంటుండగా.. డబ్బుల్లేని వారు మాత్రం అగచాట్లు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద వివిధ శస్త్రచికిత్సలు సహా అవయవ మార్పిడిలు సైతం జరుగుతుంటాయి. కిడ్నీలు, కాలేయ మార్పిడి చికిత్సలను ఆరోగ్యశ్రీలో ప్రభుత్వమే చేస్తుంది. ఇలాంటి వారు జీవితాంతం ఇమ్యునోసప్రస్ మందులు వాడాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు తలెత్తి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ఇందుకు నెలకు ప్రతి ఒక్కరూ రూ.10-15 వేల వరకు ఔషధాల కోసం వెచ్చించాలి.
ఔషధాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది
అవయవ మార్పిడి, ఆరోగ్యశ్రీ కింద ఇతర శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులు రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలోనే ఉంటున్నారు. అవయవ మార్పిడి రోగులకు ఇమ్యునోసప్రస్ మందులను నిమ్స్‌లో ప్రతి నెలా అందిస్తుంటారు. లాక్‌డౌన్‌తో వారికి ఔషధాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారు మాత్రం నిమ్స్‌లో వాటిని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి తమకూ మందులు అందించాలని ఇతర జిల్లాల్లోని రోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.