kushaiguda Fire Accident case update:మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కుషాయిగూడలోని సాయినగర్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టింబర్ డిపో యజమానులు ఉదయ్, శివ సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
kushaiguda Fire Accident case news : ప్రమాదంలో మృతుడు నరేశ్ తండ్రి జన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదముందని తెలిసినా... ఇళ్ల మధ్య టింబర్ డిపో ఏర్పాటు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నివాసాల పక్కన పెద్దఎత్తున కలప నిల్వ చేస్తున్నా, ఒకవేళ ప్రమాదం జరిగితే మంటల్ని అడ్డుకునేందుకు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. తాజాగా జరిగిన అగ్నిప్రమాదం.. తన కుమారుడు, కోడలు, మనవడు మరణించడానికి కారణమని.. ఈ ఘటనలో ఇతరులు తీవ్రంగా గాయపడ్డారని.. చాలా మంది ఇళ్లు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో ప్రస్తావించారు.
టింబర్ డిపోలో అగ్గి ఎలా మొదలైందన్నది అనేది మాత్రం.. పోలీసులు, అగ్నిమాపక అధికారులకు ప్రశ్నార్ధకంగా మారింది. డిపోలో కార్మికులు పని ముగించుకుని వెళ్లాక ఏం జరిగిందనే కోణంలో. ఆరా తీస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించనున్నారు. ఘటనాస్థలాన్ని హోం మంత్రి మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాచకొండ సంయుక్త కమిషనర్ సత్యనారాయణ చేరుకుని పరిశీలించారు.