KTR London Tour : యూకే పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు రాష్ట్రానికి పలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ హైదరాబాద్‌లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసే ఆ కేంద్రంతో 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది.
రసాయన పరిశ్రమ క్రోడా ఇంటర్నేషనల్‌తోనూ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. లండన్‌లో జరిగిన ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర విధానాలు, అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలతో రాష్ట్రం తొమ్మిదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని సోదాహరణంగా పేర్కొన్నారు.
స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ : భారత్‌లో సహజవనరులతో పాటు మానవవనరులు అపారంగా ఉన్నాయని గణాంకాలతో సహా కేటీఆర్ వెల్లడించారు. అన్నింటిని సరిగ్గా వినియోగించుకుంటే చైనా 30 ఏళ్లలో సాధించిన విజయాలను.. భారత్ 20 సంవత్సరాలలోపే సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపాధి, వ్యవస్థాపకతలో యువతకు అనేక అవకాశాలను అందించాలని పేర్కొన్నారు. భారతదేశంలో విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతోందని కేటీఆర్ చెప్పారు.
ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది : తెలంగాణ తలసరి ఆదాయం రెండున్నర రెట్లు పెరిగి.. ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని కేటీఆర్ వివరించారు. రెండున్నర శాతం జనాభా ఉన్న రాష్ట్రం.. దేశ జీడీపీలో ఐదు శాతానికి దోహదం చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ మార్క్యూటెక్ కంపెనీలకు నిలయంగా మారిందని.. ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచిందని చెప్పారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నప్పటికి.. పర్యావరణం పట్ల ఉన్న నిబద్ధతను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోలేదని కేటీఆర్ వివరించారు.