KTR Comments on Priyanka Gandhi: ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. సకాలంలో తెలంగాణ ఇవ్వక.. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రైవేట్ రంగంలో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ తరహాలోనే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తే ఏ ఒక్కరూ నిరుద్యోగిలా మిగిలేవారు కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. యువ సంఘర్షణ సభ పేరుతో రాష్ట్రానికి వస్తున్న ప్రియాంక గాంధీ.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ చేసిన నియామకాలు, కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, యువతకు చేసిన మంచిని చెబితే బాగుంటుందని పేర్కొన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి కేంద్రంగా ఉన్న తెలంగాణ.. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచిన విషయాన్ని.. తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా మరిచిపోలేదన్న సంగతిని ప్రియాంకగాంధీ గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. 2004 కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పెట్టినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగి ఉండేవి కాదన్న సత్యాన్ని ఆమె తెలుసుకోవాలని పేర్కొన్నారు. సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఈ విషయం అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకున్న సంగతిని.. పొలిటికల్ టూరిస్ట్ ప్రియాంక గాంధీ ఈ పర్యటనలో తెలుసుకుంటారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.