KTR Appeals Dubai Government to Release Five Telangana Prisoners :దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్లకు చెందిన ఐదుగురి విడుదల కోసం.. మంత్రి కేటీఆర్ మరోమారు ప్రయత్నాలు చేశారు. దుబాయ్ పర్యటనకు వెళ్లిన ఆయన.. ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి (KTR Appeals Dubai Government) తీసుకెళ్లడంతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
Minister KTR Dubai Tour 2023 : రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశ్, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు.. ఒక కేసులో భాగంగా దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు ఇప్పటికే 15 సంవత్సరాలకు పైగా వారు జైలు శిక్ష పూర్తి చేసుకున్నారు. వీరి విడుదల కోసం కేటీఆర్ స్వయంగా చొరవ చూపి, సుదీర్ఘకాలంగా అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ నేరంలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్‌కు చెందిన బాధిత కుటుంబం దగ్గరికి గతంలో స్వయంగా వెళ్లిన కేటీఆర్.. దియ్యా సొమ్ము (బ్లడ్ మనీ) అందించారు. ఆ తర్వాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని.. దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కూడా కోరింది.
అయితే కొన్ని కారణాలు, నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్షను ఇప్పటిదాకా ప్రసాదించలేదు. ఆర్నెళ్ల క్రితం కేటీఆర్ ప్రత్యేకంగా.. దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారాన్ని షరియాచట్టం ప్రకారం దియ్యా( బ్లడ్ మనీ) రూపంలో అందించడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత 2013లోనే నేపాల్ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను.. దుబాయ్ ప్రభుత్వానికి భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం ద్వారా అందించినట్లు కేటీఆర్ తెలిపారు.
అయినప్పటికీ ఇప్పటి వరకు నిందితులకు ఉపశమనం లభించలేదన్న కేటీఆర్.. భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వాధికారులకు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించి.. మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగిన వారికి వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ఈమేరకు దుబాయ్ కాన్సుల్ జనరల్‌గా వ్యవహరిస్తున్న రామ్‌కుమార్, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్, బాధిత కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు.. పలువురు తెలంగాణ ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ప్రత్యక్షంగా సమావేశమై క్షమాభిక్ష ప్రక్రియ అంశంలో సహకరించాలని కోరారు.