వేసవి కోసం కృష్ణా పంపకాలు..! శ్రీశైలంలో 800, సాగర్‌లో 505 అడుగుల నీటిమట్టాన్ని పరిగణలోకి తీసుకొని రెండు తెలుగురాష్ట్రాలకు కృష్ణా జలాలను నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది. తెలంగాణకు 29, ఆంధ్రప్రదేశ్‌కు 17.5 టీఎంసీల నీటి విడుదలకు అనుమతిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బోర్డు తాత్కాలిక ఛైర్మన్ ఆర్.కె.జైన్, సభ్యకార్యదర్శి హరికేశ్మీనా, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పటికే కోరాం...
మే నెల వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీల నీరు కేటాయించాలని గతంలోనే బోర్డునుఏపీ కోరింది. కేటాయించిన దాని కంటె ఎక్కువ ఏపీ నీటిని వినియోగించుకుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 11 వరకు శ్రీశైలంలో 46.98, సాగర్‌లో 157.05 టీఎంసీల నీరు ఉన్నట్లు తేల్చారు.
తాగు, సాగునీటికి కేటాయింపులు...
తెలంగాణకు శ్రీశైలం నుంచి కల్వకుర్తి ద్వారా మిషన్ భగీరథ కోసం 3.5, సాగర్ నుంచి మిషన్ భగీరథ అవసరాల కోసం 5 టీఎంసీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 8.5, ఏఎమ్మార్పీ కింద చెరువులు నింపేందుకు మూడు, సాగర్ ఎడమ కాల్వ కింద రబీ పంటలకు 9 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి హంద్రీనీవా, ముచ్చుమర్రి ద్వారా మూడు, సాగర్ కుడి కాల్వ నుంచి 8 టీఎంసీల విడుదలకు అనుమతించారు. సాగర్ ఎడమ కాల్వ నుంచి 3, కృష్ణా డెల్టాకు మరో మూడున్నర టీఎంసీలుకేటాయించారు.
510 అడుగులుండేలా...
వీలైనంత వరకు నాగార్జున సాగర్ లో 510 అడుగుల వరకు నీటిమట్టం ఉండేలా చూడాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. శ్రీశైలం, సాగర్ నుంచి పవర్ హౌస్‌ల ద్వారానే నీరు వదలాలని తెలిపింది. కృష్ణా డెల్టాకు రేపట్నుంచి పదివేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని బోర్డు పేర్కొంది.
ఇవీ చూడండి:మహిళా భద్రతకై... 'వీ ఆర్ వన్'