ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ (GAZETTE NOTIFICATION) ఈనెల 14 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది (KRMB MEETING ON GAZETTE). బోర్డులకు స్వాధీనం చేయాల్సిన ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూల్లో పొందుపరిచారు. దాని ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు కసరత్తు చేస్తున్నాయి.
జీఆర్ఎంబీ విషయంలో స్పష్టత
మొదట సమన్వయ కమిటీలు ఆ తర్వాత ఉపసంఘాలను ఏర్పాటు చేశాయి. రెండు రాష్ట్రాల నుంచి ప్రాజెక్టుల నిర్వహణ కోసం అధికారులు, సిబ్బంది వివరాలు, ఇతర సమాచారం తీసుకున్నారు. గోదావరికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే కృష్ణా ప్రాజెక్టుల అంశం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
నిరాకరించిన తెలంగాణ
శ్రీశైలం, నాగార్జునసాగర్, ఆర్డీఎస్, పులిచింతలకు సంబంధించి మొత్తం 30 ఔట్ లెట్లను కేఆర్ఎంబీ (Krishna river management board) ఉపసంఘం ప్రతిపాదించింది. అయితే జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కృష్ణాబోర్డుకు (KRMB MEETING ON GAZETTE) స్వాధీనం చేసేందుకు తెలంగాణ అంగీకరించలేదు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి రాకపోతే గెజిట్‌తో ప్రయోజనం లేదని ఏపీ అంటోంది. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకుంటామని కేఆర్ఎంబీ తెలిపింది.
లేఖలు రాయనున్న కేఆర్ఎంబీ
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు చెందిన అన్ని ఔట్ లెట్లను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బోర్డుకు స్వాధీనం చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డు (KRMB MEETING ON GAZETTE) ప్రకటించింది. బోర్డు తీర్మానాన్ని తమకు అంగీకరీస్తున్నామని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. శ్రీశైలం, సాగర్‌కు చెందిన డైరెక్ట్ ఔట్ లెట్లు మొత్తం 16 ఉన్నాయి. శ్రీశైలానికి సంబంధించి ఏపీ వైపున కుడిగట్టు విద్యుత్ కేంద్రం పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రీనీవా, స్పిల్‌వే ఉన్నాయి. తెలంగాణ వైపున ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల పంప్‌హౌస్ ఉన్నాయి. నాగార్జున సాగర్‌కు సంబంధించి ఏపీ వైపున కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం, కుడి కాల్వ ఉన్నాయి. తెలంగాణ వైపు జల విద్యుత్ కేంద్రాలు, ఎడమకాలువ హెడ్ రెగ్యులేటర్లు, వరద కాల్వ, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపుతూ లేఖలు రాయనుంది. వాటిని పరిశీలించి తమ పరిధిలోని ఔట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
అంగీకారం తెలిపిన ఏపీ
ఉమ్మడి ప్రాజెక్టుల అన్ని ఔట్లెట్ల స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ అధికారులు తెలిపారు. విద్యుత్ కేంద్రాలను అంగీకరించబోమన్న తెలంగాణ... స్వాధీనం కోసం బోర్డు నుంచి ప్రతిపాదనలు వస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మూడు నెలల పాటు బదలాయింపు కాలం ఉంటుందని, బోర్డు స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న ప్రకారమే నిర్వహణ జరుగుతుందని కృష్ణా బోర్డు అన్నట్లు సమాచారం. పర్యవేక్షణ మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని అన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాలు భిన్న వాదనలను వినిపించాయి.
ఇదీ చూడండి:KRMB MEETING ON GAZETTE: 14 నుంచి అమల్లోకి గెజిట్.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అప్పగింతకు అంగీకరించని తెలంగాణ