Kishan Reddy Visit Hyderabad Flood Areas : ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే మూడు నెలలు అయినా హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవాలని.. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కనీస సౌకర్యాలు కల్పించలేని బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని ఆయన ఆరోపించారు. అంబర్పేట్ పటేల్ నగర్ నుంచి ముసారాంబాగ్ బ్రిడ్జి వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ నగరవాసులకు కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చక.. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ వరదలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా చిన్నపాటి వర్షానికే భాగ్యనగర వాసులు ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
Kishan Reddy Comments On CM KCR : ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామని.. ఇస్తాంబుల్, డల్లాస్, వాషింగ్టన్ చేస్తామని అనేక రకాల ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కానీ కింది స్థాయిలో ఏ రకమైన మార్పు లేదని, ట్యాంక్ బండ్లోని మురికినీరు తీసేసి.. కొబ్బరి నీళ్లు నింపుతానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచినీటి సమస్య, ఓట్ల సమస్య, వీధి దీపాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేనటువంటి ఎన్నో సమస్యలు విశ్వనగరంలోనే ఉన్నాయని మండిపడ్డారు.