Kishan Reddy Fires on Congress and BRS : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడి డబ్బులు వెదజల్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కర్ణాటక నుంచి డబ్బు తీసుకువచ్చి, హస్తం పార్టీ రాష్ట్రంలో పంచిందని విమర్శించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే అక్కడి ప్రభుత్వం దోపిడీ చేస్తోందని, ఆ రాష్ట్ర బడ్జెట్ అంతా గ్యారెంటీలకే పోతుందని అన్నారు. హైదరాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అవినీతికి విడదీయలేని బంధం ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి దేశ ప్రజలు మూడోసారి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటి, వ్యాపార సముదాయాల పైన జరిగిన ఐటీ సోదాల్లో రూ.290 కోట్ల అక్రమ సంపాదనను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి
ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది : దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద అక్రమ సంపాదన బయట పడటం తొలిసారని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. డబ్బులు లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయి తప్పితే, లెక్కించడం పూర్తికావడం లేదని చెప్పారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నట్లు గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. దీనిని బట్టి హస్తం పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు అని కిషన్‌రెడ్డి అన్నారు.