ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకతే వేరు. 1954లో ఒక్క అడుగు ఎత్తుతో మొదలైన గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన.. ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చింది. గతేడాది 62 అడుగుల ఎత్తులో విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడు. ఆరున్నర దశాబ్దాలుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిస్తున్నాడు. నవరాత్రులు స్వామిని దర్శించుకునేందుకు నగరంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చేవాళ్లు. నిమజ్జనాలు సైతం ముందు ఖైరతాబాద్ గణపతి తర్వాతే సందడి నెలకొనేది. ఈసారి కరోనా పరిస్థితుల వల్ల అంతా తారుమారైంది. వినాయకుడి విగ్రహం 9 అడుగులకు మాత్రమే పరిమితమైంది.
ఈసారి ఆరోగ్య ప్రదాతగా
కొవిడ్‌ను అంతం చేస్తానంటూ ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ఆరోగ్య ప్రదాతగా కొలువు దీరుతున్నాడు. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా భక్తులకు సాక్షాత్కరించనున్నాడు. ఎత్తు భారీగా తగ్గినా అదే రూపం.. అదే ఉత్తేజంతో ఖైరతాబాద్ గణేనాథుడ్ని శిల్పి నగేశ్ తీర్చిదిద్దాడు. మహాగణపతికి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతి దేవిలు కొలువుదీరారు. ధన్వంతరి నారాయణగా భక్తులకు ఆరోగ్యాన్ని పంచడమే కాకుండా... ఇన్నాళ్లు చదువుల తల్లికి దూరంగా ఉన్న పిల్లలకు సరస్వతి కటాక్షం లభించాలని గణేశ్ ఉత్సవ సమతి అభిప్రాయపడింది. ఉద్యోగ, ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోతున్న సగటు కుటుంబాలకు లక్ష్మీదేవి రూపంలో ఆశీస్సులు దొరికాలని ఆకాంక్షించింది.