రాష్ట్రంలోని పరిశ్రమలు, వైద్యఆరోగ్యశాఖలతో పాటు పారిశ్రామిక వర్గాలు, ఉత్పత్తి సంస్థలు ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పాలుపంచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ (ఇండియన్ డ్రగ్స్, ఫార్మాసూటికల్స్ లిమిటెడ్) సహకారం కూడా తీసుకోనుంది. గతంలో అంతగా వినియోగం లేకపోవడం వల్ల రాష్ట్రంలో పలు సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి. ప్రస్తుతం పదికి పైగా ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. పారిశ్రామిక, వైద్య అవసరాలకు ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి ప్రాణవాయివును తెప్పించుకుంటున్నాం. తాజాగా రెండో విడత కరోనా ఉద్ధృతిలో కేంద్రం... ఒడిశా, తమిళనాడు, కర్ణాటకల నుంచి కేటాయించింది. ఒడిశా మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి సహకారం లేకపోవడంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
కలిసొచ్చిన పారిశ్రామికవర్గాలు
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవర్గాలు కొత్త వాటి ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు మూతపడిన ప్లాంట్ల వివరాలను అందించాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, జోగిపేటలలో ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంస్థలు ముందుకొస్తే ప్రభుత్వం మూడు నెలల్లో అనుమతులు ఇవ్వనుంది.
గ్రీన్‌కోకు పాశమైలారం బాధ్యతలు
ఆక్సిజన్ ఉత్పత్తిలో అనుభవం గల గ్రీన్‌కో సంస్థకు పాశమైలారంలో మూతపడిన 40 టన్నుల ప్లాంటు పునరుద్ధరణ బాధ్యతలను అప్పగించింది. సంస్థ యాజమాన్యం, గ్రీన్‌కోల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రీన్‌కో సంస్థ జర్మనీ, బెల్జియం, అమెరికాల నుంచి అధునాతన యంత్రాలను తెప్పించింది.