తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తిక మాసంలో పూజలు... జన్మ జన్మలకు పుణ్యాలు

తెలుగు నెలల్లో అత్యంత మహిమాన్వితమైన మాసం కార్తికం. ఈ నెలలో హరిహరాదులను స్తుతించడంతోపాటూ చేసే ఇతర పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుందని అంటారు.

karthika-masam-started-from-today
కార్తిక మాసంలో పూజలు... జన్మ జన్మలకు పుణ్యాలు

By

Published : Nov 16, 2020, 6:37 AM IST

Updated : Nov 16, 2020, 6:49 AM IST

కార్తికం... తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో నెల. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలుస్తాడు కాబట్టే ఈ నెలను కార్తికం అని అంటారు. దీపావళి మర్నాడు నుంచీ మొదలయ్యే ఈ నెలలో ప్రతిరోజూ పర్వదినమేనని చెబుతారు. శివకేశవులను భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో చేసే పూజలూ, నోములూ, వ్రతాల వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం చేసే స్నానం, జపం, ధ్యానం, పూజ, దానం, దీపారాధనతో పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. అయితే... నెలమొత్తం చేయలేని వారు కార్తికంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, పోలాల అమావాస్య, సోమవారాలలో ఉపవాస దీక్షను నియమనిష్టలతో ఆచరించొచ్చని అంటారు. ఆ రోజులలో ఉపవాసం ఉండి, చీకటి పడ్డాక నక్షత్ర దర్శనం చేసుకుని... ఆ తరువాత భోంచేస్తే అక్షయ సంపదలూ, సర్వశుభాలూ లభిస్తాయనీ కార్తిక పురాణంలో ఉంది.

కార్తిక మాసంలో పూజలు

ప్రధానంగా సోమవారం నాడు ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే.. లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కూడా కాదని బ్రహ్మ చెప్పాడు. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే అయినా... కొన్ని ముఖ్యమైన రోజులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండటం విశేషం. వాటిల్లో దీపావళి తరువాత వచ్చే భగినీ హస్త భోజనం, నాగులచవితి, నాగపంచమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి.. వంటివి కొన్ని. అంతటా శివనామస్మరణ ప్రతిధ్వనించే కార్తికంలో కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం రుద్రాభిషేకాలూ, రుద్రపూజలూ, లక్ష బిల్వ దళాల పూజలూ, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలూ విశేషంగా నిర్వహిస్తుంటారు. వాటితోపాటూ కేదారేశ్వర వ్రతం... కార్తిక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్నీ చేసుకోవడం కొందరు సంప్రదాయంగా పాటిస్తారు. ఈ మాసంలో సోమవారం నాడు శ్రవణా నక్షత్రం రావడం అరుదు. అలా వస్తే గనుక ఆ రోజును కోటి సోమవారంగా పిలుస్తారు. ఆ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందంటారు. ఈ నెలలోనే అయ్యప్ప దీక్ష మొదలై.. సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. ఈ నెలలోనే గంగానది ఇతర నదులూ, చెరువులూ, కొలనుల్లో కలిసి.. వాటన్నింటినీ పవిత్రంగా మారుస్తుందనీ చెబుతారు.

విష్ణువుకూ ప్రియమే...
కార్తిక మాసంలో పూజలు

కార్తికంలో శివుడినే కాదు... విష్ణువునూ పూజించాలనీ.. లేదా ఇద్దరిలో ఏ ఒక్కరిని అర్చించినా ఇద్దరూ సంతోషిస్తారని అంటారు. ఏడాదిలో ప్రతి మాసంలో విష్ణువుకు ఒక పేరు ఉంటుంది. కార్తికంలో స్వామిని దామోదరుడిగా కొలుస్తారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లి, కార్తిక శుద్ధ ఏకాదశినాడు నిద్రలేస్తాడని అంటారు. ఈ నెలలో విష్ణువును తులసీదళాలు, మల్లె, కమలం, జాజి, గరిక దర్బలతో పూజించడం వల్ల ఇహపర సుఖాలతోపాటు ఉత్తమగతులు కలుగుతాయని చెబుతారు. అదేవిధంగా కార్తికమాసం మొత్తం తులసికోట దగ్గర ఉదయం, సాయంత్రం దీపం పెట్టడం... పౌర్ణమి రోజున తులసి, ఉసిరి చెట్టుకూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఓ సంప్రదాయం. ఉసిరికి చేసే పూజ పేరు ధాత్రి పూజ. ధాత్రి అంటే ఉసిరిక. ఇందులో లక్ష్మీదేవి ఆవాసమై ఉంటుందంటారు. కార్తికమాసంలో ఒక్కసారైనా ఉసిరిచెట్టుకు ఎనిమిది దీపాలు పెట్టి, ఎనిమిది ప్రదక్షిణలు చేసి... తులసిని పరదేవతా స్వరూపంగా పూజిస్తే.. తులసి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

దీపారాధన ఎలా...
కార్తిక మాసంలో పూజలు


కార్తికమాసంలో చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో ప్రతిరోజూ మాత్రమే కాదు.. కార్తికపౌర్ణమి రోజున వెలిగించే 365 దీపాల వల్ల గత జన్మలోనే కాదు.. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని కార్తికపురాణం చెబుతోంది. ఈ నెలలో కుదిరినన్ని రోజులు... తెల్లవారు జామునే లేచి స్నానం చేసి.. కృత్తికా నక్షత్రం అస్తమించే లోగా తులసి కోటముందు దీపం పెడితే మంచిదని చెబుతారు. అలా ఉదయం పెట్టే దీపం విష్ణువుకు చెందుతుందనీ.. సాయంత్రం పెట్టే దీపం తులసికి చెందుతుందని చెబుతారు. వీటన్నింటితోపాటూ కుటుంబసభ్యులూ, స్నేహితులూ కలిసి వనభోజనాలకు వెళ్లడం కూడా ఈ మాసంలో పాటించే సంప్రదాయాల్లో ఒకటి. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ పవిత్ర మాసం మొత్తం భక్తులు హరిహర నామస్మరణతో తన్మయులవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇదీ చూడండి:కార్తిక పూర్ణిమ పూజలు.. వ్రత ఫలాలు..!

Last Updated : Nov 16, 2020, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details