కార్తికమాస పూజలతో రాష్ట్రంలో ఊరూవాడా పండగ వాతావరణం నెలకొంది. ఆలయాలు ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో గోదావరి నది వద్ద మహా హారతి నిర్వహించారు. గోదారమ్మకు వాయనం అందించి కన్నులపండువగా వేడుక జరిపించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని చక్రేశ్వర శివాలయంలో లక్ష దీపారాధన నిర్వహించారు. భీంగల్‌లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రథోత్సవంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. బాల్కొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అనేక మంది దంపతులు దృష్టి దోష నివారణ యాగం చేపట్టారు.