Kantivelugu Program In Telangana: కాస్త శ్రద్ధ, సమయానికి పరీక్షలు చేయించటం ద్వారా ఎంతో మంది కంటి చూపును కోల్పోకుండా కాపాడవచ్చు అని వైద్యులు చెపుతున్నారు. ఆర్థిక ఇబ్బందులో లేక సమయం వృథా అవుతుందన్న ఆలోచనో కారణం ఏదైనా కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం ఒకరి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది. ఈ నేపథ్యంలో నివారించదగిన అంధత్వం బారిన పడుతున్న వారిని కాపాడుకునేందుకు సర్కారు ఈ ఏడాది మరోమారు కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరి 19 రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 50శాతానికి పైగా ప్రజలకు పరీక్షలు పూర్తి చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 50.84 శాతం మందికి కంటి పరీక్షలు పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది. 41.71 శాతం గ్రామ పంచాయితీలు, 53.42 శాతం వార్డుల్లో ఇప్పటికే కంటి పరీక్షలు పూర్తి చేయటం విశేషం.
Kanti Velam Program Second Phase: ఈ ఏడాది జనవరిలో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మం వేదికగా కంటి వెలుగు రెండో దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 15 నాటికి అంటే వంద రోజుల్లో వంద శాతం మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది.