KA Paul Comments: తెరాస తనను చంపించడానికి ప్రయత్నిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అమీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 2005లో తన పీస్ మిషన్‌ను రద్దు చేయించి లక్షలాది మంది పొట్ట కొట్టారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పతనమవుతోందన్నారు. రాహుల్‌గాంధీ వరంగల్ రైతు సంఘర్షణ సభపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. సభ కోసం 87 కోట్లు ఖర్చు చేశారని.. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ రైతులను ఆదుకుంటామంటూ మాయ మాటలు చెబుతోందని దుయ్యబట్టారు.
పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో ఆయనకే తెలియదని కేఏ పాల్ అన్నారు. పవన్‌కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని పాల్ అభివర్ణించారు. అయనకు ప్రజా సేవ చేయాలనే చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. కాంగ్రెస్, తెదేపా పార్టీలతో పాటు పవన్‌కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసిందన్నారు. రాహుల్ సభకు జనాలను తరలించారని...అయన వాగ్దానాలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మేస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నారన్నారు.