Junior NTR to meet Amit Shah: మునుగోడు సమరభేరి పేరిట భాజపా నిర్వహిస్తున్న సభ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌కు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. మునుగోడు సభ అనంతరం తిరుగు పయనంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్‌లో రాత్రి 8.30 గంటలకు అమిత్ షాతో ఎన్టీఆర్ సమావేశం కానున్నారు. అమిత్‌షా - ఎన్టీఆర్ భేటీని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా నేడు ‘మునుగోడు సమరభేరి’ పేరుతో భాజపా సభ నిర్వహిస్తోంది. దీనికి ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ శాసనసభ స్థానాలను ఉప ఎన్నికల్లో కైవసం చేసుకున్న కమలదళం.. మునుగోడులోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సభకు కమలనాథులు భారీగా జనసమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు పలువురు మునుగోడులోనే మకాం వేసి జనసమీకరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
షెడ్యూల్లో మార్పులు..: మునుగోడు సభ కోసం రాష్ట్రానికి వస్తున్న అమిత్‌షా మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్ల నుంచి వచ్చే భాజపా కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్ సభామూర్తినగర్‌లో పార్టీ దళిత కార్యకర్త ఎన్.సత్యనారాయణను కలుసుకొని అరగంట పాటు గడుపుతారు. సత్యనారాయణ గత మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పార్టీ కోసం పనిచేస్తున్నారని భాజపా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్ తెలిపారు.