ఇక్కడ జీసస్కు ఉర్దూ వచ్చు! మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నాటి ఎన్నో ఆనవాళ్లు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయి. చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ, ఫలక్‌నుమా ప్యాలెస్... ఇలా ఎన్నో చారిత్రక ప్రాంతాలు నాటి గుర్తులుగా కనిపిస్తూనే ఉన్నాయి. భాగ్యనగర చరిత్ర పుటల్లో మరో అరుదైన ప్రదేశం ఉంది. అదే వందేళ్ల నాటి.... హిందూస్థానీ చర్చి.
ఇక్కడ ఉర్దూలో ప్రార్థనలు...
అబిడ్స్‌లోని హైదరాబాద్ కలెక్టరెట్ ఎదురుగా వందేళ్ల నాటి సెయింట్ లూక్స్ హిందుస్థానీ చర్చ్ ఉంది. ప్రత్యేకత ఏంటని ఆరా తీస్తే...వందేళ్ల నుంచి ఉర్దూలో యేసు ప్రభువును ఆరాధిస్తుంటారని తెలిసింది. నిజాం హయాంలో క్రిస్టియన్ మిషన్ సొసైటీ ఎకరంన్నర స్థలంలో ఈ చర్చిని నిర్మించింది. అప్పట్లో ప్రథమ భాషగా ఉర్దూ మాట్లాడేవారు. క్రైస్తవ మిషన్ బైబిల్‌ను ఉర్దూతోపాటు భారతీయ భాషలన్నింట్లోనూ అనువాదం చేసింది. ఆ సమయంలో క్రైస్తవ మిషన్ ప్రచారం వల్ల కొంత మంది హైదరాబాదీ ముస్లింలు ఈ మతంలో చేరి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు.
ఇదీ చూడండి: గుర్రాలతోనే జీవితస్వారీ...
ఆరాధనకు భాష అవసరం లేదంటున్న క్రైస్తవులు...
తర్వాతి కాలంలో చాలా మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్ వెళ్లడం వల్ల చర్చికి వచ్చే వారి సంఖ్య తగ్గింది. కాలక్రమంలో హిందుస్థానీ చర్చి మరుగునపడింది. ఉత్తరాదితోపాటు విదేశాల నుంచి ఇతర మతస్థులు బాప్టిజం వ్యాప్తి చేసి.. పాస్టర్లుగా పనిచేయడం వల్ల మళ్లీ ప్రార్థనలు మొదలయ్యాయి. దేవుడి ఆరాధనకు భాషతో సంబంధం లేదంటున్నారు క్రైస్తవ మత ఆరాధకులు.
ఇదీ చూడండి:కోడిపెట్ట... కౌజుపిట్ట... ఏది కావాలి?
ఏకైక చర్చి హిందూస్థానీ...
తెలుగు రాష్ట్రాల్లోనే ఉర్దూలో ప్రార్థనలు చేసే ఏకైక చర్చి ఇదేనని..21 ఏళ్లుగా అక్కడే ఉంటోన్న హనీస్ సాగర్ తెలిపారు. మొదట్లో హిందూస్థానీ చర్చిని, ఉర్దూ చర్చిగా పిలిచేవారట. ఇక్కడ చెప్పే సందేశాలు క్లుప్తంగా, అర్థవంతంగా ఉండటం వల్ల ఎక్కువ మంది రావడానికి ఇష్టపడుతున్నారు.
కాలగమనంలో శిథిలావస్థకు చేరిన హిందూస్థానీ చర్చిని 2013లో పునరుద్ధరించారు. మెదక్ డైసిసన్ పర్యవేక్షణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ ప్రార్ధనామందిరంలో 75 కుటుంబాలు సంఘ సభ్యులుగా సేవలందిస్తున్నాయి. నాడు క్రైస్తవ మతం తీసుకున్న ముస్లింల కోసం నిర్మించిన ఈ చర్చిలో ఇప్పటికీ ఉర్దూలో జీసెస్ ఆరాధన జరుగుతుండటం విశేషం.
ఇదీ చూడండి:కథలు చెప్తామండీ... కథలు చెప్తాం...!