జమ్ముకశ్మీర్‌లో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా జవాను మరుపోలు జశ్వంత్‌రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనతో జవాన్ జశ్వంత్‌రెడ్డి సొంతూరు బాపట్ల మండలం దరివాద కొత్తవాసి పాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో జశ్వంత్‌రెడ్డితో పాటు మరో భారత జవాన్ వీరమరణం పొందారు.
శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్‌రెడ్డి. మరికొద్ది రోజుల్లో అతనికి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ ఈలోపు ఆయన ఉగ్రవాద దాడికి బలైపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జశ్వంత్‌రెడ్డి మృతదేహం బాపట్లకు పంపించేదుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జశ్వంత్‌రెడ్డి మద్రాస్ రెజిమెంట్‌లో 2016లో సైనికునిగా చేరారు. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించారు. అనంతరం జమ్ముకశ్మీర్ వెళ్లారు. వీర జవాన్ జశ్వంత్‌రెడ్డి మృతికి ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.