తెలంగాణ

telangana

ETV Bharat / state

Gajendra Singh Shekhawat: కేసీఆర్​ది ఓ డ్రామా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు - Gajendra Singh Shekhawat on cm kcr

Gajendra Singh Shekhawat
Gajendra Singh Shekhawat

By

Published : Nov 11, 2021, 6:09 PM IST

Updated : Nov 12, 2021, 6:43 AM IST

18:06 November 11

కేసీఆర్​ది ఓ డ్రామా.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి ఇరురాష్ట్రాల అంగీకారంతో బోర్డుల పరిధిని నోటిఫై చేయడాన్ని డ్రామా అని ఎలా అంటారు? ఇది ఈ దేశ రాజ్యాంగ సూత్రాలపై ప్రాణాంతక దాడిచేయడమే.

                                 -కేంద్రమంత్రి షెకావత్‌

కృష్ణా జల వివాద పరిష్కారం కోసం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసువేసి అనవసర జాప్యానికి కారణమై..ఇప్పుడు కేంద్రాన్ని బాధ్యులను చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం నాలుగురోజుల క్రితం కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటులో జాప్యం గురించి మాట్లాడుతూ తన పేరును ప్రస్తావించారని, అందుకే వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నానన్నారు. ఆయన గురువారం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘1956 అంతర్రాష్ట్ర జల వివాద పరిష్కార చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం కృష్ణా జల వివాద పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుకోసం 2015లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి కేసు కోర్టులో అపరిష్కృతంగా ఉంది. న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దీనిపై నిర్ణయం తీసుకోవడమనే అంశం కేంద్రం పరిధిలో లేకుండాపోయింది. మరోవైపు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలూ దీర్ఘకాలంగా జరగలేదు. నేను మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంగీకారంతో గత ఏడాది అక్టోబరు 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశా. యుద్ధప్రాతిపదికన కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు అవసరాన్ని కేసీఆర్‌ ఆ సమావేశంలో ప్రస్తావించారు. ఆ అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున నిర్ణయం తీసుకోలేమని చెప్పా. స్పందించిన ఆయన కేసు ఉపసంహరించుకుంటూ రెండురోజుల్లో దరఖాస్తుచేస్తామని హామీఇచ్చారు. దాన్ని ఆచరణలో పెట్టడానికి 8 నెలల సమయం తీసుకున్నారు. దాదాపు 8 నెలల తర్వాత సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు దరఖాస్తు చేశారు. దానిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. అంతిమంగా ఈ ఏడాది అక్టోబరు 6న సుప్రీంకోర్టు కేసు ఉపసంహరణకు అనుమతిచ్చింది. అప్పట్నుంచే మా పాత్ర ప్రారంభమైంది. తెలంగాణ సీఎం మాత్రం ఏడేళ్లుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రభుత్వం వేసిన కేసు కారణంగా జరిగిన జాప్యానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు?

బోర్డుల పరిధి నోటిఫై చేసేందుకు కృషిచేశాం

నీటి విడుదల, విద్యుదుత్పత్తి విషయంలో అనుసరించాల్సిన ప్రాధాన్యం గురించి రెండురాష్ట్రాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నందున వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కృష్ణా, గోదావరి బోర్డుల న్యాయ పరిధిని నోటిఫై చేయకపోవడం సమస్యను జటిలం చేస్తోందని గుర్తించి ఆ అంశాలను ఎజెండాలో చేర్చి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాం. రెండు ప్రభుత్వాలతో సుదీర్ఘంగా చర్చించి బోర్డులను నోటిఫై చేశాం. కేసీఆర్‌ ఇప్పుడు అకస్మాత్తుగా దీన్నంతా ఓ డ్రామాగా అభివర్ణించారు.

ప్రాజెక్టుల అప్పగింతకు సహకరించాలి

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు బోర్డులకు సహకరించినప్పుడే ఇరురాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల వినియోగ సమస్యను పరిష్కరించడానికి, అయోమయం లేకుండా బోర్డుల పరిధిని సున్నితంగా అమలుచేయడానికి వీలవుతుంది. అందుకోసం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం రెండురాష్ట్రాలు తమ పరిధిలోని ప్రాజెక్టుల నియంత్రణాధికారాలను బోర్డులకు అప్పగించాలి. సున్నితంగా సమస్యను చక్కదిద్దడానికి వీలు కల్పించాలి’’ అని షెకావత్‌ అన్నారు. తర్వాత విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం కోర్టులో ఉపసంహరణ పిటిషన్‌ దాఖలుచేయకముందు నుంచే కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై న్యాయశాఖ అభిప్రాయం కోరే ప్రక్రియను మేం ప్రారంభించాం. కేంద్రం సానుకూల దృక్పథంతో పనిచేస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మమ్మల్నే బాధ్యుల్ని చేస్తోంది. కేసీఆర్‌ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది దేశానికంతటికీ తెలుసు.

ప్రాజెక్టుల అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు ముందుకు రాకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది?

అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏంచేయాలో! రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో చెప్పారు. ప్రాజెక్టులు అప్పగించడం, నిధుల విడుదల, ఇతర మౌలికవసతుల కల్పనకు సంబంధించిన స్పష్టమైన తేదీలను రాష్ట్రాలకు చెప్పాం. అన్నీ రెండు ప్రభుత్వాల ఏకాభిప్రాయంతో సున్నితంగా జరిగిపోవాలని కోరుకుంటున్నాం. అంతిమంగా ఏదో ఒక తేదీ నుంచి దాన్ని మొదలుపెట్టాల్సిందే.

కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుత స్థితి ఏమిటి?

ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై న్యాయశాఖ అభిప్రాయం కోసం లేఖరాశాం. న్యాయశాఖ మంత్రితో వ్యక్తిగతంగానూ మాట్లాడాను. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయాలా? లేదంటే ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే కొత్త విధివిధానాలు ప్రతిపాదించవచ్చా? అనే విషయమై న్యాయశాఖ అభిప్రాయం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం.

కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది?

కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రక్రియ. న్యాయశాఖ అభిప్రాయం చెప్పేంతవరకు దాని ఏర్పాటు గురించిగానీ, తేదీ గురించిగానీ నేనేమీ చెప్పలేను. కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయమని న్యాయశాఖ సూచించిన పక్షంలో ఛైర్మన్‌, ఇతర సభ్యుల పేర్లు సూచించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ఇప్పుడున్న ట్రైబ్యునల్‌కే కొత్త విధివిధానాలను ప్రతిపాదించడం మేలని భావిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన డీపీఆర్‌లను కేంద్రం ఆమోదించడంలేదనే ఆరోపణలపై ఏమంటారు?

ఇవి అర్థంలేని ఆరోపణలు, అవాస్తవాలు. కేవలం కాగితాలను పంపితే, వాటిని డీపీఆర్‌లుగా పరిగణించలేం. వాటిని సరైన పద్ధతిలో పంపాలి. అలా పంపకపోవడమే సమస్య.

ఇదీ చూడండి:

అక్టోబర్‌ తొలి వారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం..!

CM KCR: కేసీఆర్ ఫామ్‌హౌస్‌ దున్నుతా అంటావు.. నువ్వు ట్రాక్టర్‌ డ్రైవర్‌వా?

Last Updated : Nov 12, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details