IT Raids on Congress Leaders Houses in Hyderabad : హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids in Telangana)నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో పాటు అదే టికెట్ ఆశించిన బడంగపేట్ మేయర్ పారిజాతా నర్సింహ్మారెడ్డి (Parijatha Narsimha Reddy) ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. వేకువజామున 5 గంటలకే ఆరుగురు సభ్యుల అధికారుల బృందం బాలాపూర్‌లోని పారిజాత ఇంటికి చేరుకుంది.
ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నరసింహారెడ్డి ఇంట్లో లేకపోగా.. దిల్లీ వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వారిని వెంటనే రమ్మని కబురు పెట్టిన అధికారులు.. అందరి ఫోన్లు స్వాధీనం చేసుకుని సోదాలు ప్రారంభించారు. స్థిరాస్తి వ్యాపారం చేసే నరసింహారెడ్డి.. సాయంత్రం 5 గంటల సమయంలో తిరిగి వచ్చారు. మేయర్ పారిజాతను ఐటీ అధికారులు తిరుపతిలో అదుపులో తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి రెడ్డిభవన్‌కు వచ్చిన ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న కక్షతోనే ఐటీ అధికారులతో దాడులు చేయించారని పారిజాత ఆరోపించారు.
IT Raids in Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు
బాలాపూర్‌కే చెందిన కాంగ్రెస్ నాయకుడు వంగేట లక్ష్మారెడ్డి ఇంటికి కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు వెళ్లారు. ఆయన భార్య గత మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోగా.. లక్ష్మారెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు శంకర్‌పల్లి మండలం మాసానిగూడతోపాటు చేవెళ్ల మండలం తంగడపల్లి, శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉన్న కాంగ్రెస్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్) (Kichannagari Lakshma Reddy) వ్యవసాయ క్షేత్రాలకు నిన్న ఉదయం 6 గంటలకే అధికారులు చేరుకొని.. సోదాలు ప్రారంభించారు.