IT Notices For Cheekoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో.. రూ.2.8 కోట్ల విలువైన కారుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. రేంజ్ రోవర్ కారు విషయంలో ఈ నోటీసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. ఆ కారు తన స్నేహితుడి సంస్థకు చెందినదని.. అవసరమున్నప్పుడు దానిని వాడుకుంటున్నట్లు అధికారులకు ప్రవీణ్ తెలిపాడు. అయితే అధికారులు మాత్రం ఇది ప్రవీణ్ బినామీ సంస్థ పేరుతో కొనుగోలు చేసిన కారుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫెమా నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డాడని ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఐటీ కూడా నోటీసులు పంపించడంతో.. ఈ విషయంలో అన్ని వైపుల నుంచి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
క్యాసినో వ్యవహారంపై మొన్నటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగగా, ఇప్పుడు ఐటీశాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ను కీలక సూత్రధారిగా పరిగణించి.. ప్రవీణ్‌కు సంబంధించిన ఇళ్లల్లో, సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కొన్ని నెలల క్రితం ప్రవీణ్‌ను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించింది. అసలు విదేశాలకు ఇక్కడ నుంచి సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను తరలించడంపై ప్రత్యేకంగా ప్రశ్నించింది.
బ్యాంక్ స్టేట్‌మెంట్లను కూడా నిశితంగా పరిశీలించింది. ప్రవీణ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా ఈడీ ప్రశ్నించింది. విదేశీ క్యాసినో అక్రమాలపై జరిగిన హవాలా లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐటీ సైతం రేంజ్ రోవర్ కారు విషయంలో నోటీసులు పంపించింది.