తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టి పెడతారు: కేటీఆర్‌ - ఎన్​హెచ్​ఆర్డీ సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు

KTR Comments at NHRD Conference: భారత దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని...ఆర్ధికాభివృద్ధి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడతారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జపాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, తైవాన్‌ వంటి చిన్న దేశాలు...అభివృద్ధిలో దూసుకెళ్తుంటే...మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటున్నామని పేర్కొన్నారు. ఒక సంస్థ, దేశం...ప్రకృతి వనరులు, మానవ వనరుల్ని సమర్థంగా వినియోగించుకున్నపుడే విజయవంతమవుతాయని అన్నారు. 35 ఏళ్ల కిందట మనతో సమానంగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ... ఎలా ముందుకువెళ్లిందో.. యువత గమనించాలన్నారు.

KTR
KTR

By

Published : Feb 2, 2023, 8:03 PM IST

Updated : Feb 2, 2023, 10:58 PM IST

భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టి పెడతారు: కేటీఆర్‌

KTR Comments at NHRD Conference: హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి నెట్‌వర్క్‌ సంస్థ నిర్వహిస్తున్న... డికోడ్‌ ది ఫ్యూచర్‌ మూడు రోజుల సదస్సుకు... ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెుదటి రోజు 80కు పైగా హెచ్‌ఆర్‌ సంస్థలు పాల్గొన్న సదస్సులో ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌... ఉద్యోగులు, నిర్వాహకుల్లో ఉత్సాహాన్ని, ఆలోచనలను రేకెత్తించారు. చైనా, జపాన్‌లు అభివృద్ధి చెందిన తీరును... కేటీఆర్‌ గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి కంటే... రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టిపెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చిన్నదేశాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నామని వివరించారు. చిన్న చిన్న దేశాల నుంచి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్‌ వస్తుంటే భారత్‌ నుంచి అలాంటి ఒక్క బ్రాండ్‌ కూడా లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

'డీకోడ్‌ ద ఫ్యూచర్‌' అంశంపై జాతీయ సదస్సు.. హాజరైన ఈటీవీ భారత్ హెచ్‌ఆర్‌ సంస్థ ఉద్యోగులు

'దురదృష్టవశాత్తు మన ఆలోచనలు ఎప్పుడూ రాజకీయాలపైనే ఉంటున్నాయి. మనం ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. మనం అంతా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలా అనే దానిపైనే దృష్టి పెడుతున్నాం. మన భవిష్యత్‌ తరానికి మంచి జీవితాన్ని ఇవ్వాలనడంపై దృష్టి పెట్టడం లేదు. ఇదే మన దేశంలో సవాలుగా మారింది. ఎన్నికలపైనే ధ్యాస ఉండేలా ముందుకెళ్తున్నాం. ఈ విషయంలో నేనేమీ భిన్నమని చెప్పడం లేదు. నాతో సహా అందరూ అలాగే ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వాస్తవంగా జరుగుతున్నది ఇదే. ఏడాదంతా ఎన్నికలు జరగడం.. ప్రతి రాజకీయ నాయకుడు ఆర్థిక అభివృద్ధిపై కాకుండా.. రాజకీయాలపై దృష్టి పెట్టడమే.. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సమస్య.'-కె.టి. రామారావు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

తెలంగాణ తరహాలో దేశంలోని మిగతా ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తే... దేశం ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే రోల్‌ మెడల్‌గా మారిందన్న ఆయన... ఎనిమిదన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని లెక్కలతో సహా వివరించారు. మిషన్‌ భగీరథలో ప్రతి ఇంటికి సురక్షిత జలాలను అందిస్తున్నామని... కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్నిధాన్యాగారంగా మార్చామంటూ తెలిపారు. ఇదే తరహాలో భారత్‌ను అభివృద్ధి చేయవచ్చని...కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

'డీకోడ్‌ ద ఫ్యూచర్‌' అంశంపై జాతీయ సదస్సు.. హాజరైన ఈటీవీ భారత్ హెచ్‌ఆర్‌ సంస్థ ఉద్యోగులు

'ఎనిమిదేళ్లలో 4.6 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఆర్థికంగా ఎదిగింది. ప్రతి ఏటా 15శాతం వృద్ధి సాధిస్తున్నాం. తెలంగాణా జనాభా 2.5శాతమే. కానీ మేం భారత స్థూల జాతీయోత్పత్తికి 5శాతం సమకూరుస్తున్నాం. అంటే మేం 50 కిలోల బాక్సర్‌ అయినప్పటికీ... 100 కిలోల విభాగంలో పోటీపడుతున్నాం. రెండింతలు కష్టపడుతున్నాం. అంటే.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని... మానవ వనరుల నిర్వహిస్తూ... అంచనాలకు తగ్గట్టు పనిచేస్తేనే అది సాధ్యమైంది. క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నయో మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించి.. తార్కిక ఆలోచనతో మానవ వనరులను వాటికి కేటాయించి... ఈ విజయాలు సాధించారు. ఒక వేళ యావత్‌ భారత దేశం.. తెలంగాణ తరహాలో పని చేస్తే... ఒక వేళ భారత్‌కు... కేసీఆర్‌ లాంటి నాయకుడు ఉంటే... నా దృష్టిలో 5 ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థ అనేది జోక్‌ మాత్రమే. వాస్తవానికి 15 ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థను సాధించగలం.'-కేటీఆర్,ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి

హైదరాబాద్‌లో 3 రోజుల పాటు కొనసాగనున్న ఎన్‌హెచ్‌ఆర్‌డి జాతీయ సదస్సులో ఇవాళ హెచ్‌ఆర్‌ నిపుణులు, ఈటీవీ, ఈటీవీ భారత్ సహా పలు ప్రముఖ హెచ్‌ఆర్‌ సంస్థలతో సహా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 2, 2023, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details