తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గడిచిన ఐదేళ్లలో ఏడాదికి సగటున ఆరేడు వందల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.900ల కోట్ల నష్టం వచ్చింది. తాజాగా డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ నష్టం రూ.1000 కోట్లు దాటుతుందని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేల కోట్ల అప్పులు
అధికారిక లెక్కల ప్రకారం ఆర్టీసీకి సుమారు రూ.3,200ల కోట్ల వరకు అప్పులున్నాయి. బ్యాంకుల నుంచి రూ.1,700 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ నుంచి రూ.750 కోట్లు, ఉద్యోగులు నెలవారీ సొసైటీలో దాచుకున్న రూ.600ల కోట్లను కూడా యాజమాన్యం వాడుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల అవసరాలకు సొసైటీ నుంచి రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో డీజిల్ ధరలు పెరగడం ఆర్టీసీకి ప్రాణసంకటంగా మారిపోయింది. ఏం చేయాలో తెలియని అధికారులు టికెట్ ఛార్జీలు పెంచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.