బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇవాళ మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్ష జరగనుంది. మొదటి సంవత్సరం 4 లక్షల 80 వేల 516 మంది.. రెండో సంవత్సరం 4 లక్షల 85 వేల 323 మంది కలిపి మొత్తం 9 లక్షల 65 వేల 839 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1339 పరీక్ష కేంద్రాలు, ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, 25వేల 550 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం నాలుగు సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. మార్చి 18 వరకు ప్రధాన పరీక్షలు కొనసాగుతాయి.
ఇవీ నిబంధనలు..
ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులకు అనుమతిస్తారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు విద్యార్థులు ఓఎంఆర్ సమాధాన పత్రాలు.. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడానికి లొకేటర్ మొబైల్ యాప్‌ను ఇంటర్ బోర్డు రూపొందించింది. విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.