నిబంధనలు పాటించని పరిశ్రమల నుంచి వస్తున్న ఘాటైన వాసనలతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రసాయన, బల్క్‌డ్రగ్ పరిశ్రమలు చిమ్మే విషవాయువుల కారణంగా వాంతులు, విరేచనాలు, తల తిరగడం, కళ్ల మంటలు తదితర సమస్యలతో అల్లాడిపోతున్నారు. వీటిపై ఒక్క అక్టోబరులోనే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి 665 ఫిర్యాదులు రావటం గమనార్హం. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.
ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో పీసీబీ అధికారులు కాలుష్యకారక పరిశ్రమలపై దృష్టిపెట్టారు. రామచంద్రాపురం జోన్‌లో గడ్డపోతారం, పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, ఖాజిపల్లి తదితర పారిశ్రామికవాడల్లోని 54, హైదరాబాద్ జోన్‌లో మేడ్చల్, జీడిమెట్ల పారిశ్రామికవాడల్లోని 20 పరిశ్రమల నుంచి ఘాటైన వాసనలు అధికంగా వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో చౌటుప్పల్ ప్రాంతంలో, హైదరాబాద్-బెంగళూరు మార్గంలో కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లోకి వెళ్లగానే భరించలేని ఘాటైన వాసనలు వస్తున్నాయని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.
పరిశ్రమల నిర్లక్ష్యంతోనే..
నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి పలు పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించటం లేదు. ఫలితంగా ఉత్పత్తుల తయారీ సమయంలో అవి విషవాయు వ్యర్థాల్ని భారీగా గాల్లో కలిపేస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని.. తనిఖీలు, చర్యలకు అధికారుల్ని ఆదేశించామని పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ ‘ఈనాడు- ఈటీవీ భారత్'కు తెలిపారు.
విస్తృత తనిఖీలు..
ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. నైట్ పెట్రోలింగ్ బృందాల సంఖ్యను ఒకటి నుంచి మూడుకు పెంచాం. జోన్లవారీగా కాలుష్యకారక అనుమానిత పరిశ్రమల్ని గుర్తించి అధికారులు తనిఖీ చేస్తున్నారు. కంపెనీల్లో స్క్రబ్బర్లు సవ్యంగా ఆమర్చారా? వాసన నియంత్రణ చర్యలు తీసుకున్నారా?.. అన్నది పరిశీలిస్తున్నాం. 665కి గాను 596 ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాం.- రఘు, చీఫ్‌ఇంజినీర్, పీసీబీ
బాధితులు ఇంటికొకరు..
వాయుకాలుష్య బాధితులు ప్రతి కుటుంబంలో ఒకరుంటారు. చిన్నప్పుడు నా కాళ్లు బాగానే ఉండేవి. కాలుష్యం కారణంగా వంకరపోయాయి.
- వంట ఎల్లయ్య, గడ్డపోతారం