తెలంగాణలో పెట్టుబడులకు ఇండోనేషియా పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని ఆ దేశ రాయబారి సూర్యొదిపురొ తెలిపారు. త్వరలోనే వారు రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. ఇండోనేషియా పారిశ్రామికవేత్తలను తాము స్వాగతిస్తున్నామని, అన్నివిధాలా వారిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భారత్‌లో ఇండోనేషియా రాయబారి సూర్యొదిపురొ, ముంబయి కాన్సులేట్‌లోని కాన్సుల్ జనరల్ అగస్ పి.సప్టోనొలు మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
సూర్యొదిపురొ మాట్లాడుతూ.. భారత్-ఇండోనేషియాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అవి మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రోత్సాహాకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. తమ దేశ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారని వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమని, ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వారికి పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్, రాష్ట్రంలో వనరులు, వసతులు, ప్రోత్సాహకాలు, రాయితీలు అనుకూలతలు తదితర అంశాలను వివరించారు. ఇండోనేషియాతో తెలంగాణ అనుబంధం గురించి చర్చించారు. సమావేశం అనంతరం సూర్యొదిపురొ, సప్టోనొలకు మంత్రి కేటీఆర్ జ్ఞాపికలు అందజేశారు.