Independence Day Diamond Jubilee Celebrations: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. పలు జిల్లాల్లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని చేబూని నినాదాలతో దేశభక్తిని చాటారు. హైదరాబాద్ సైకిల్ గ్రూప్ కుత్బుల్లాపూర్ నుంచి 100 కిలోమీటర్ల తిరంగా సైకిల్ యాత్రను ఆదివారం ప్రారంభించింది.
మెదక్ జిల్లా చేగుంట సమీపంలో ఈ యాత్రలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో జాతీయ పతాకాన్ని రూపొందించడంలో ఆది నుంచి జరిగిన మార్పులపై ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. నల్గొండలో వజ్రోత్సవాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలో భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్‌లో ఈవీ రైడ్ విత్ ప్రైడ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. టీ-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు ప్రదర్శనను ప్రారంభించారు. మారథాన్ రన్నర్ జగన్‌మోహన్ 75 కిలోమీటర్ల పరుగు తీశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గోల్కొండ మీదుగా రన్‌ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో దివిస్ ల్యాబొరేటరీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. చౌటుప్పల్ నుంచి లింగోజిగూడెం వరకు 300 బైక్‌లతో జాతీయ జెండాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో తిరంగా సంకీర్తనలు చేపట్టారు. ఆదర్శనగర్, వసంత్ విహార్ కాలనీలో హరేరామ హరేకృష్ణ భక్త బృందం భజనలతో దేశభక్తి చాటారు. మంచిర్యాలలో ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో పురవీధుల గుండా తిరంగా ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీశారు.
ఖమ్మం జిల్లా వైరాలో మత్స్యకారులు వినూత్నంగా దేశభక్తిని చాటారు. వైరా జలాశయంలో తెప్పలపై జాతీయ జెండాలతో నీటిలో ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. తల్లాడలో హిందూ-ముస్లిం-క్రైస్తవుల ఐక్యత చాటుతూ ముస్లిమ్ ఆవాజ్ తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో 330 అడుగుల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు.
కిలిమంజారోపై 75 అడుగుల జాతీయ పతాకం:తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ యేముల నితిన్ ఆదివారం ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన (19,341 అడుగుల) శిఖరం కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శిఖరంపై ఆయన 75 అడుగుల జెండాను ప్రదర్శించారు. ఆయనను సమాచార పౌరసంబంధాల కమిషనర్ అర్వింద్‌కుమార్, సంచాలకుడు రాజమౌళి, ఇతర అధికారులు అభినందించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలంగాణ ఫోరం ప్రతినిధులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలి: డీజీపీ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వార్డులు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించాలని, ఉదయం 11.30 గంటలకు ట్రాఫిక్‌ను నిలిపేసి అలారం మోగేలా మైక్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. గీతాలాపనలో అందరూ క్రమశిక్షణతో పాల్గొనేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం నిర్వహణలో కలెక్టర్లు, ఇతర అధికారులతో కలిసి ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేసేది వీరే:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం 32 జిల్లాకేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేవారి పేర్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జెండా వందనం చేయనుండగా మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లలో జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పురస్కారాలను అందజేస్తారు.