రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 71 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. దీనితో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 1991 మంది ఈ మహమ్మారి బారినపడినట్టు పేర్కొంది. ఇక తాజాగా 120 మంది కోలుకుని గాంధీ నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 1284మంది పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం 650
ఇక మంగళవారం తాజాగా ఒకరు మృతి చెందగా... ఇప్పటివరకు 57 మంది చెందడం బాధాకరం. మరో 650మంది ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు ఐదుగురు వెంటిలేటర్‌పై ఉన్నట్టు సమాచారం. మరోవైపు గాంధీలో ప్లాస్మా థెరపీని సైతం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తుండటం మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.
గాంధీలో అందిస్తున్న వైద్య సేవలపై మంత్రి రాజేందర్.. గాంధీ సూపరిండెంటెంట్ సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.
నాలుగో విడత లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. జీహెచ్ఎంసీలోని కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. అయితే దాదాపు నెలరోజుల తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవడం గమనార్హం.
మంగళవారం నమోదైన కేసుల వివరాలు ఇలా...
- జీహెచ్ఎంసీ-38
- రంగారెడ్డి-7
- మేడ్చల్ -6
- వలస కార్మికులు-12
- విదేశాల నుంచి వచ్చినవారికి-4
- సూర్యాపేట-1
- వికారాబాద్-1
- నల్గొండ-1
- నారాయణపేట-1
మంగళవారం నమోదైన కేసుల్లో 55 తెలంగాణకు చెందినవికాగా.. మిగతా 16 కేసులు ఇతర ప్రాంతాల వారివి కావడం గమనార్హం. గత కొంత కాలంగా వివిధ జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదుకాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. జీహెచ్ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను దాదాపు సడలించింది. అయితే పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా మారుతుడటం గమనార్హం.
దాదాపు నెల రోజుల తర్వాత జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదుకావడం వల్ల వైద్యారోగ్య శాఖ కరోనా కట్టడికి మరిన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఇదీ చదవండి:గొర్రెకుంట హత్యల నిందితునికి 14 రోజుల రిమాండ్