కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారంతో.. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసరాల కోసం గత నాలుగు రోజులుగా దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్దఎత్తున కొనుగోళ్లు చేస్తున్నారు. కొన్ని పెద్ద మార్కెట్లను తాత్కాలికంగా మూసివేయడంతో పలుచోట్ల సరకుల కొరత నెలకుంటోంది. సాధారణంగా నెల మొదటి వారంలో రద్దీ ఉండే సూపర్ మార్కెట్లలో జూన్ నెలాఖరులోనే తీవ్రమైన రద్దీ నెలకొంది. గత సోమవారం నుంచి మార్కెట్ల వద్ద ఉదయం నుంచి భారీ క్యూలు ఉంటున్నాయి.
ప్రజలు నెలన్నర రెండు నెలలకు సరిపోయేలా సరకులు కొనుగోలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోమారు లాక్‌డౌన్ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందనే సమాచారం నేపథ్యంలోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాలకు నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు ప్రధానంగా బేగంబజార్ నుంచి సరఫరా అవుతాయి. బేగంబజార్ మార్కెట్ గత ఐదు రోజులుగా మూతపడటంతో పలు కిరాణా దుకాణాల్లో సరకులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.