తెలంగాణ

telangana

ETV Bharat / state

కరవులోనూ పెరిగిన రైతుల ఆదాయం.. ఏం చేశారంటే..?

Drought Farmers Income: ప్రణాళిక ఉంటే ప్రకృతిపైనా విజయం సాధించవచ్చని నిరూపించింది క్రిడా శాస్త్రవేత్తల బృందం. వాతావరణ మార్పులకు అనుగుణంగా కరవు ఏర్పడినప్పుడు.. రైతులకు శిక్షణ ఇచ్చి తగిన పంటలను చేయించవచ్చని జాతీయ మెట్టపంటల పరిశోధన సంస్థ తెలిపింది. తమ సంస్థకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని.. కరవును అధిగమించేలా చేపట్టిన మార్పులతో ఆదాయం పడిపోకుండా నిరూపించారని తెలిపింది.

Drought Farmers Income
కరవు రైతుల ఆదాయం

By

Published : Jan 24, 2022, 8:51 AM IST

Drought Farmers Income: వాతావరణ మార్పులతో కరవు పరిస్థితులేర్పడినా రైతులకు శిక్షణ ఇచ్చి తగిన పంటలను సాగుచేయిస్తే వారి ఆదాయం 35 శాతం పెరిగిందని జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా గతంలో కొన్ని ప్రాంతాల్లో కరవు ఏర్పడినప్పుడు పంటల సాగులో తమ ఆదాయం 54, పాడిపై 40 శాతం ఆదాయం తగ్గినట్లు ఆ రైతులు చెప్పారని వివరించింది. తమ సంస్థకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాతావరణ మార్పులు, కరవును అధిగమించేలా పంటల సాగు, పాడిపశువుల పెంపకంలో చేపట్టిన మార్పులతో ఆదాయం పడిపోకుండా చూడవచ్చని నిరూపించారని వివరించింది. వీరు నిర్వహించిన అధ్యయనంపై వెలువరించిన పరిశోధన పత్రంలోని ముఖ్యాంశాలు...

  • రాజస్థాన్‌, గుజరాత్‌లోని కొన్ని పల్లెలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం నంద్యాలగూడెం, బోరింగుతండా, సూర్యాపేట గ్రామీణ మండలం కసరాబాద్‌ గ్రామాల్లో 2019-20లో పంటల సాగుపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
  • ఈ గ్రామాలు తీవ్ర వర్షాభావ ప్రాంతాలు. ఇక్కడ ఏడాదికి సగటు వర్షపాతం 750-850 మిల్లీమీటర్లు. అధ్యయనానికి ఎంచుకున్న మొత్తం 750 ఎకరాల పంటభూముల్లో 80 శాతం వర్షాధారంగా సాగయ్యేది.
  • ఒక్కో గ్రామం నుంచి 60 రైతు కుటుంబాలను శాస్త్రవేత్తలు సమగ్రంగా పరిశీలించారు. వారికున్న భూమి, వయసు, విద్య, పంటల సాగుతీరు, ఆదాయం, పాడి పశువుల వివరాలన్నీ నమోదు చేశారు. వాతావరణ మార్పుల వల్ల వారి ఆదాయంపై ఎంత ప్రభావం పడుతుందో శాస్త్రీయంగా విశ్లేషించారు.
  • ఈ గ్రామాల్లో 80 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు ఎక్కువగా 44-46 ఏళ్ల మధ్యవయస్కులు. వారిలో 50 శాతం మంది అక్షరాస్యులు. ఈ కుటుంబాలకున్న సగటు కమత విస్తీర్ణం 2.27 హెక్టార్లు. వీరిలో సగానికి పైగా 2 హెక్టార్లలోపు భూమి కలిగిన చిన్నకారు రైతులు. ఈ కుటుంబాల్లో ఎస్సీలు 17, ఎస్టీలు 7, బీసీలు 75 శాతమున్నారు.
  • ఒక రైతు కుటుంబానికి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో సాగు, పాడి, ఇతర పనులతో ఏడాదికి రూ.2,36,196 ఆదాయం రాగా కరవు ఏడాదిలో అది రూ.1,70,153కి పడిపోయినట్లు తేలింది. పెద్ద కమతం ఉన్న రైతుల ఆదాయంలో 1.70 శాతమే తగ్గుదల కనిపించగా, చిన్న, సన్నకారు రైతుల ఆదాయం గరిష్ఠంగా 50.70 శాతం వరకూ పడిపోయింది.
  • అత్యధికంగా మిరప పంటలో 44.35 శాతం, మొక్కజొన్నలో 41.67, మల్బరీలో 32.32, కందిలో 34.70, పత్తిలో 30.41, వరిలో 28.81 శాతం పంట దిగుబడి తగ్గింది.
  • ఈ కాలంలో రైతులకు ఉపాధి దొరికే రోజుల సంఖ్య 29 శాతం తగ్గింది. కానీ వ్యవసాయేత పనులకు, సాగునీటి వసతి ఉన్న ఇతర గ్రామాలకు కూలీలుగా రైతులు వెళ్లడం వల్ల ఉపాధి ఎక్కువగా దొరికింది.
  • కరవు రోజుల్లో వ్యవసాయంపై తమ ఆదాయం తగ్గిపోయినట్లు 48 శాతం రైతు కుటుంబాలు తెలిపాయి. పశుగ్రాసమూ దొరకడం లేదన్నారు.


శిక్షణతో మార్పు

  • శిక్షణ ఇవ్వడంతో రైతులు విభిన్న రకాల పంటలను సాగుచేశారు. వానాకాలంలో వరి, పత్తి, కంది వేశారు. యాసంగిలో మిరప, మొక్కజొన్న మల్బరీ, కూరగాయలు వంటివి సాగుచేయడమే కాకుండా పాడిపశువుల పెంపకం చేపట్టారు. వీటితో ఈ కుటుంబాల వార్షిక సగటు ఆదాయం రూ.2,14,327 వచ్చింది. అంతకు ముందు కరవు రోజుల్లో ఈ ఆదాయం రూ.1.70 లక్షలు.
  • రైతులకున్న తక్కువ భూమిలోనే విభిన్న రకాల పంటల సాగు వల్ల వారి ఆదాయం పెరిగింది. పంటల సాగు, పాడి పశువుల పెంపకమే కాకుండా రైతు కుటుంబ సభ్యులు టైలరింగ్‌, చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇతర పొలాల్లో కూలి పనులకు సైతం వెళుతూ వేతనాలు పొందారు.
  • వాతావరణంలో తరచూ వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలి. కరవు ఏర్పడుతుందనే ముందస్తు అంచనాలివ్వడం, సకాలంలో దాన్ని అధిగమించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సాయపడటం, విపత్తు నిర్వహణ ప్రణాళిక, సామూహికంగా అందరినీ సిద్ధం చేయడం వంటివి అవసరం అని పరిశోధన పత్రంలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details