హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు వీలుగా ప్లాట్‌ఫాంలను విస్తరిస్తున్నారు. కరోనా కారణంగా రైళ్లు నడవకపోవడంతో ఈ పనులు చకచకా సాగిపోతున్నాయి. 12 బోగీలున్న ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు 24 బోగీలుండే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు కూడా ఆగేలా ప్లాట్‌ఫాంల నిడివిని పెంచుతున్నారు. మరో నెల రోజుల్లో ఇవి పూర్తవుతాయి. ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం ఓ పాదచారుల వంతెన ఉంది. దీనికి అనుసంధానం చేస్తూ ఇరువైపులా రూ. 75 లక్షలతో లిఫ్టులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ స్టేషన్లో ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగితే 5 నియోజకవర్గాల ప్రజలకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించే వెసులుబాటు కలుగుతుంది.
హైటెక్ హంగులు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా ప్లాట్‌ఫాంలు పెంపు - హైదరాబాద్ తాజా వార్తలు
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు 1, 2, 3.. ఇలా 7 దశల్లో విస్తరించి ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా అవతరించింది. ఈ కాలనీకి చేరువగా హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ ఉంది. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ప్రజలకు సైతం అందుబాటులో ఉండేది ఈ స్టేషనే. ఇక్కడి నివాసితులతో పాటు 5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేసే సైబరాబాద్‌కు కూత వేటు దూరంలోనే ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ స్టేషన్ నుంచి వేల మంది ఐటీ ఉద్యోగులు ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుండేవారు. ఈ స్టేషన్ ప్రాధాన్యాన్ని ఎట్టకేలకు గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ఇక్కడ ఆధునిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది.
5 నియోజకవర్గాల ప్రజలతో పాటు..
హైటెక్ సిటీ స్టేషన్ మీదుగా అటు ముంబయి, బెంగళూరు వెళ్లే రైళ్లతో పాటు విశాఖపట్నం మీదుగా హౌరా వెళ్లే రైళ్లు, కాకినాడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వెళ్లే అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం జరిగిన అభివృద్ధి పనులతో ఇక్కడే ఎక్స్‌ప్రెస్‌లు ఆగే అవకాశం లభిస్తుంది. గుంటూరు, అమరావతి కేంద్రంగా పని చేస్తున్న అనేక ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆంధ్రపదేశ్ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో కూకట్‌పల్లి పరిసరాల్లోనే ఉంటున్నారు. వీరు ప్రతి సోమవారం నగరం నుంచి వెళ్లేందుకు.. తిరిగి శుక్రవారం వచ్చేందుకు వీలుగా ఇక్కడి నుంచి వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుకోడానికి కూడా వీలు కలుగుతుంది.